సచివాలయ ఉద్యోగులకు జగన్ భారీ షాక్ లు-డిప్యుటేషన్ల రద్దు, ప్రజా దర్బార్, బయోమెట్రిక్ కోతలు
ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు పూర్తి స్ధాయిలో తీసుకెళ్లేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయాలు ఉద్యోగులకు మాత్రం షాకిచ్చాయి. ఇప్పటివరకూ సాధారణ హాజరు పుస్తకాల్లో సంతకాలు పెడుతున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ లేకపోతే ఈ నెల జీతాలు ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు సచివాలయాల్లో పని ఒత్తిడి తట్టుకోలేక వివిధ శాఖలకు డిప్యుటేషన్లపై వెళ్లిన ఉద్యోగులకూ సర్కార్ షాకిచ్చింది.

సచివాలయాల్లో కీలక మార్పులు
ఏపీలో ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రజల్లో వాటి ప్రభావం పూర్తి స్దాయిలో కనిపించడం లేదని భావిస్తున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు వాటి అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న విభాగాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుతో పాటు ఉద్యోగుల పనితీరుపైనా దృష్టిపెట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీటి ప్రభావం సహజంగానే ఉద్యోగులపైనా పడబోతోంది.

బయోమెట్రిక్ లేకపోతే జీతం కట్
ఇప్పటివరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ ఆధారంగా జీతాలు చెల్లించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా పూర్తి స్ధాయిలో అమలు చేయలేకపోయారు. దీంతో ఈ నెల నుంచి కచ్చితంగా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అన్నట్లుగానే ఈ నెల బయోమెట్రిక్ లో వేలిముద్రలు వేయని ఉద్యోగులకు జీతాలు కట్ చేస్తామని తేల్చిచెప్పింది. వివిధ పనుల పేరుతో సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు వేయకుండా వచ్చి వెళ్లిపోతున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ ఒక పూట ఉంటే ఆ రోజు సగం జీతం, అస్సలు లేకపోతే పూర్తి జీతం కోత పడనుంది.

డిప్యుటేషన్ల రద్దుతో మరో షాక్
సచివాలయాల్లో ఉద్యోగులుగా నియామకాలు అయిన తర్వాత అందులో ఒత్తిడి తట్టుకోలేక కొందరు, ప్రభుత్వం తమ అవసరాల మేరకు మరికొందరిని వివిధ శాఖల్లో డిప్యుటేషన్లపై వాడుకుంటోంది. దీంతో సచివాలయాల పనితీరుపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం సచివాలయాలకు తగినంత మంది ఉద్యోగుల్ని కేటాయించినా డిప్యుటేషన్ల పేరుతో కొందరు వెళ్లిపోవడంతో సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం పడుతోంది. దీంతో తక్షణం వివిధ శాఖలకు డిప్యుటేషన్లపై వెళ్లిన ఉద్యోగుల్ని వెంటనే వెనక్కి రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రోజూ ప్రజా దర్బార్ తప్పనిసరి
సచివాలయ ఉద్యోగులకు అప్పగించిన మరో బాధ్యత ప్రతి రోజూ సాయంత్రం ప్రజల నుంచి వినతుల స్వీకరణ. ప్రస్తుతం ఆ కార్యక్రమం కూడా సక్రమంగా సాగడం లేదు. దీంతో ప్రభుత్వం సాయంత్రం పూట ప్రజా దర్బార్ నిర్వహించి సచివాలయాల పరిధిలోని ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, వినతులు స్వీకరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు పంపింది. కరోనా ప్రభావం తగ్గడంతో ఈ కార్యక్రమానికి ప్రజల స్పందన కచ్చితంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Recommended Video

ఒత్తిడిలో జగన్ సర్కార్
రెండేళ్ల క్రితం వైసీపీ సర్కార్ సచివాలయ ఉద్యోగులుగా 1.27 లక్షల మందిని నియమించుకుంది. ఆ రెండేళ్లలో ప్రొబేషన్ పిరియడ్ గా నిర్ణయించి రూ.15000 మాత్రమే జీతాలుగా చెల్లిస్తోంది. ఇప్పుడు రెండేళ్లు పూర్తి కావడంతో వీరందరికీ రెగ్యులర్ పేస్కేల్ కు మార్చాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వంపై పెను ప్రభావం పడుతుంది. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల పనితీరు విషయంలోనూ ప్రభుత్వం అంచనాలు పెరిగిపోతున్నాయి. రెగ్యులర్ వేతనాలు ఇవ్వాల్సిన పరిస్ధితుల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఆ మేరకు వారి నుంచి పని రాబట్టేందుకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications