2029 ఎన్నికలు జరిగేది వీటి మధ్యే: తేల్చుకోవడానికి రెడీ: తేల్చి చెప్పిన జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతులను, రాజ్యాంగ వ్యవస్థలను కూటమి పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలో 'రూల్ ఆఫ్ లా' కాకుండా 'రూల్ ఆఫ్ ఫియర్' నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే అణచివేసే ధోరణి సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా క్షీణించిందని, సాధారణ ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఏపీలోని ప్రస్తుత పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా మారాయని, 'జంగిల్ రాజ్'ను తలపిస్తోన్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు రూపంలో రియల్ లైఫ్ విలన్ కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ సీనియర్ ఎన్టీఆర్ బతికి ఉండి చంద్రబాబును ప్రశ్నించినా, ఆయనపై కూడా రౌడీషీటర్ అని ముద్ర వేసేవారంటూ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. హే రామ్.. సేవ్ ఏపీ అనే నినాదంతో అందరి నోళ్లల్లో నానుతోందని పేర్కొన్నారు.
టీడీపీకి సంబంధించిన ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లను కుట్రపూరితంగా తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండానే పనులు పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశిస్తున్నారని ధ్వజమెత్తారు. అర్హుల ఓట్లను తొలగిస్తే వారికి సంక్షేమ పథకాలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. ఓట్లను తొలగిస్తూ చివరికి స్థానిక ప్రజలకు కనీస పౌరసత్వం లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వివాదాన్ని ప్రస్తావిస్తూ జగన్ పోలీసుల తీరును తప్పుపట్టారు. సంబంధిత పోలీస్ స్టేషన్‌లో గత 18 నెలలుగా సీసీటీవీ కెమెరాల ఫీడ్ లేదని రిమాండ్ రిపోర్టులో చూపించడంపై ఆయన మండిపడ్డారు. స్థానికంగా సీసీ ఫుటేజ్ డిలీట్ చేసినా, విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్న భద్రపరిచే లైవ్ ఫీడ్ ఏమైందని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లలో సాక్ష్యాధారాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
తాను అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని, అక్కడి రైతులపై తనకు పూర్తి సానుభూతి ఉందని జగన్ స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా రావాల్సిందేనని పునరుద్ఘాటించారు. తాము ప్రతిపాదించిన విశాఖపట్నం రాజధాని అంశానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాబోయే ఎన్నికలు విశాఖపట్నం వర్సెస్ అమరావతిల మధ్యే జరుగుతాయని, ప్రజల మద్దతు ఎవరికి ఉందో అప్పుడే తేలిపోతుందని సవాల్ విసిరారు.
అమరావతికి మద్దతు ఇచ్చే వాళ్లు టీడీపీకి, మావిగన్ కు అండగా నిలిచేవాళ్లు వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారని జగన్ తేల్చి చెప్పారు. మావిగన్, అమరావతిల్లో ప్రజల మద్దతు ఎవరికి ఉందో ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం బీచ్‌లను కూడా వదలట్లేదని, ఇదివరకు కుటుంబంతో ప్రశాంతంగా వెళ్లేవాళ్ళు.. ఇప్పుడు బీచ్ షాక్స్ వల్ల వాటిలో మందుబాబులు తిష్ట వేస్తారని, ఇలాంటి వాతావరణంలో ఫ్యామిలీతో కలిసి ఎవరు కూడా బీచ్ కు వెళ్లరని అన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కూటమి ప్రభుత్వం ఘోరంగా నిర్లక్ష్యం చేసిందని జగన్ ఆరోపించారు. పొగాకు, ఆక్వా సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ధరల స్థిరీకరణకు తగిన నిధులు కేటాయించలేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం గురించి చర్చ జరిగితే, నేడు చంద్రబాబు పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, కస్టోడియల్ మరణాలపై చర్చ జరగడం బాధాకరమంటూ ముగించారు.












Click it and Unblock the Notifications