ఆపరేషన్ఆకర్ష్: లాగుతున్నారని టిడిపిపై జగన్ నిప్పులు
హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నిప్పులు చెరిగారు. టిడిపి చాలా దారుణ చర్యలకు దిగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి లాక్కుంటోందన్నారు.
ఇటీవలే కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలను టిడిపి తమ పార్టీలోకి చేర్చుకుందని, కేవలం ప్రతిపక్షం నోరు నొక్కడానికే ఈ కుతంత్రాలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయపరంగా ప్రతిపక్షమైన తమ నోరు నొక్కగలరేమోగాని నిజమైన ప్రతిపక్షం మాత్రం ప్రజలేనని వారి నోరు మాత్రం నొక్కకూడదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.

అసెంబ్లీలో జగన్ మాట్లాడారు. శాసన సభలో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేయవద్దన్నారు. సభలో రెండు పక్షాలు మాత్రమే ఉన్నప్పటికీ బీఏసీ సమావేశానికి విపక్షం నుండి ఎంతమందికి అవకాశం ఇచ్చారో అందరీకీ తెలుసునన్నారు. బీఏసీలో సభ్యుల నియామకం సక్రమంగా లేదన్నారు.
ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్షపాతి అన్నారు. ప్రజా సమస్యలే ఏకైక అజెండాగా మెలగాల్సిన నేత అని, ఆ స్ఫూర్తితోనే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా జనానికి అండగా నిలిచారన్నారు. పదేళ్లు అసలు సిసలైన ప్రజల పక్షపాతిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు.












Click it and Unblock the Notifications