రాజీనామా చేస్తారా: బాబుకు జగన్ సవాల్, ఎవరు గొప్ప: మంత్రి
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శాసన సభలో సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు తాను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక పెంచుతున్నారని ఆరోపించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక్క రూపాయి విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. వైయస్ హయాంలో క్రిసెల్ రేటింగ్ బ్రహ్మాండంగా వచ్చిందన్నారు. చంద్రబాబు గతంలో ఎనిమిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. చంద్రబాబు చక్కటి అబద్దాలతో కట్టు కథలు అల్లారన్నారు. కిరణ్ సర్కారు ఛార్జీలు పెంచితే నాడు విప్ జారీ చేసి మరీ ఆయన సర్కారును ఎందుకు కాపాడారని ప్రశ్నించారు.
చార్జీల పెంపు పైన చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమన్నారు. చంద్రబాబు చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే ఆయన రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. జగన్ తన ప్రసంగాన్ని ముగిస్తూ... చంద్రబాబు 45 నిమిషాల టైం తీసుకుంటే, తాను ఇరవై నిమిషాలే తీసుకున్నానని, తాను సంబంధిత అంశం పైనే మాట్లాడానని, మరో విషయం మాట్లాడలేదన్నారు. దానిపై సభాపతి కోడెల స్పందిస్తూ.. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమన్నారన్నారు.

ఎవరు గొప్ప?: అచ్చెన్నాయుడు
28వేల కోట్ల రూపాయల భారం మోపిన పార్టీ గొప్పదా లేక ఒక్క రూపాయి ఛార్జీలు పెంచకుండా 24 గంటలు విద్యుత్ ఇచ్చిన టీడీపీ గొప్పదా చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విద్యుత్ పైన జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనకు ఆ అంశం పైన ఎంత అవగాహన ఉందో అర్థమవుతోందన్నాడు.
13 రూపాయలకు యూనిట్ విద్యుత్ కొన్న వైయస్ గొప్పవాడా, రూ.5కు కొన్న చంద్రబాబు గొప్పవాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడుతున్న కటుంబాలు 86 శాతం ఉన్నాయన్నారు. వారందరికీ పెంపు లేదని చెప్పారు. జగన్ సంబంధంలేని విషయాలు సభ దృష్టికి తెచ్చారన్నారు.












Click it and Unblock the Notifications