హెలెన్ తుఫాను: ఒకే స్పాట్‌లో చంద్రబాబు, జగన్!
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఒకేచోట పర్యటించి బాధితులను పరామర్శించారు. చంద్రబాబు సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి హెలెన్ తుఫాను బాధితులను పరామర్శించారు. ఆ మరుసటి రోజు (మంగళవారం) జగన్ అదే జిల్లాలో పర్యటించారు.
అయితే ఇరువురు నేతలు ఒకే పొలంలో పర్యటించడం గమనార్హం. చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా సిహెచ్ గున్నేపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న గొలకోటి శ్రీరామమూర్తి పొలాన్ని పరిశీలించారు. ఆ పొలాన్ని కౌలుకు చేస్తున్న మామిడిశెట్టి మరిడయ్యతో మాట్లాడి హెలెన్ తుఫాను వల్ల నష్టపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ కూడా బాబు పరిశీలించిన పొలాన్నే మళ్లీ పరిశీలించి రైతులతో మాట్లాడారు.

కాగా, మంగళవారం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కౌలు రైతుల ఖాతాల్లోకి బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాలు జమ చేస్తామని బాబు హామీ ఇచ్చారు. అన్నదాతలు, మత్స్యకారులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులుపడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని విమర్శించారు.
తుపాను మీద తుపాను వచ్చి రైతులు, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించకుండా ఎసి రూముల్లో కూర్చుంటున్నారని విమర్శించారు. కనీసం ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని భావిస్తే లెహర్ తుఫాన్ తర్వాత వస్తారని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన జగన్.. రాష్ట్రంలో పాలకులు పాలనను మరిచి పదవుల కోసం కేంద్రం వద్ద పాకులాడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications