మోడీతో పొత్తుకు వైయస్ జగన్, చంద్రబాబు పోటీ?

రాష్ట్ర విభజన తప్పదని తేలడంతో జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని అంటున్నారు. ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలు స్వీకరించాలని బిజెపి అగ్ర నేతలు చంద్రబాబును ఆహ్వానించినట్లు కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తరువాతనే పొత్తులకు సంబంధించి బహిరంగ ప్రకటన చేయాలని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
సీమాంధ్రలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా ఉండాలంటే పొత్తు ఉండాల్సిందేనని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రలో టిడిపి ఒంటరిగా పది వరకూ లోక్‌సభ స్థానాలను గెలిచే అవకాశం ఉందని ఇప్పటికే పలు జాతీయ ఛానళ్లు చేసిన సర్వేలలో వెల్లడైంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రధాన మంత్రి పదవిని అధిష్టించాలంటే దేశంలోని ప్రతి లోక్‌సభ స్థానమూ ముఖ్యమేనని బిజెపి భావిస్తోంది. అలాంటప్పుడు పది స్థానాలు గెలిచే అవకాశమున్న తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటే లబ్ది చేకూరుతుందనే ఆలోచనలో బిజెపి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పార్టీల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా బిజెపితో పొత్తు కుదుర్చుకుంటే ఎలా ఉంటుందని ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఈ దిశగా ఆయన సంకేతాలు కూడా ఇచ్చారు. సమైక్యాంధ్ర నినాదంతో జగన్ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో సీమాంధ్రలో దాదాపు 15 సీట్ల వరకూ గెలుపొందే అవకాశాలున్నట్లు పలు వార్తా సంస్థలు నిర్వహించిన సర్వేలలో తెలియజేస్తున్నాయి. కాంగ్రెసును తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలంటే బిజెపి పొత్తు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications