పవన్ పై రూటు మార్చిన జగన్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్ ద్వారా కొత్త ప్రణాళికలతో సిద్దం అవుతోంది. అటు మాజీ సీఎం జగన్ తన రాజకీయ రూటు మార్చారు. ఇక, ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తున్న జగన్.. గతం కంటే భిన్నంగా పవన్ పైన మాత్రం మౌనం పాటిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్లో పవన్ ను విస్మరిస్తున్నారు. జగన్ అసలు ఎందుకు పవన్ పైన ఎలాంటి విమర్శలు చేయటం లేదు.. దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి....
జగన్ వ్యూహం మారిందా
మాజీ సీఎం జగన్ రోడ్డు పైకి వస్తున్నారు. ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత తొలి సారిగా రైతుల సమస్యల పైన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గత ఎనిమిది నెలల కాలంలో పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వం పైన జగన్ విమర్శలు చేసారు. చంద్రబాబు లక్ష్యంగానే జగన్ ఆరోపణలు కొనసాగుతున్నాయి. పవన్ పైన మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయ టం లేదు. వైసీపీ నేతలు.. ఆ పార్టీ మద్దతుగా సోషల్ మీడియా మాత్రం పవన్ లక్ష్యంగా ఆరోపణలు కొనసాగిస్తోంది. జగన్ మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో అసలు పవన్ ప్రస్తావన చేయటం లేదు. చంద్రబాబు పైన మాత్రమే గురి పెడుతున్నారు.

చంద్రబాబు పై గురి
ఎన్నికల ప్రచారం వరకు చంద్రబాబు తో పాటుగా పవన్ ను ఉద్దేశించి జగన్ పలు ఆరోపణలు చేసారు. పవన్ వివాహాల గురించి విమర్శలు చేసారు. ఇప్పుడు ఇంత సడన్ గా పవన్ గురించి ఎలాంటి ఆరోపణలు చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తూ.. పవన్ ను విస్మరించటం వ్యూహాత్మకమా.. లేక,చంద్రబాబును మాత్రమే జగన్ తన రాజకీయ ప్రత్యర్ధిగా భావిస్తున్నారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. పవన్ ను టార్గెట్ చేసిన కారణంగానే గోదావరి జిల్లాల్లో, సీమ ప్రాంతంలోనూ బలమైన వర్గం మద్దతు తనకు దూరమైందనే నివేదికలతో జగన్ ఇప్పుడు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది.
పవన్ పేరెత్తకుండానే
చంద్రబాబు పైన గురి పెట్టటం ద్వారా మొత్తంగా ప్రభుత్వం పైనే టార్గెట్ చేసినట్లవుతుందనే వాదన వినిపిస్తోంది. కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పవన్ కొంత ఇబ్బంది కర పరిస్థితుల్లో ఉన్నారనే చర్చ కొనసాగుతోంది. ఈ సమయంలోనే చంద్రబాబు పైన దాడి తీవ్రత పెంచటం జగన్ వ్యూహం గా స్పష్టం అవుతోంది. జగన్ వరుసగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నా.. పవన్ సైతం మౌనంగానే ఉంటున్నారు. దీంతో, పొలిటికల్ వార్ మరోసారి టీడీపీ వర్సస్ జగన్ గా మారుతోంది. కూటమిలో పరిణామాలతోనే జగన్ తన రూటు మార్చినట్లు వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ మౌనం ఆసక్తి కరంగా మారుతోంది. దీంతో, రానున్న రోజుల్లో జగన్ - పవన్ ఇద్దరి రాజకీయం ఏ విధంగా ఉంటుందనేది కీలకంగా మారనుంది.












Click it and Unblock the Notifications