హాట్ లైన్లో టచ్ లో చంద్రబాబు, రాహుల్, రేవంత్-జగన్ షాకింగ్ ఆరోపణ..!
జాతీయ స్ధాయిలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. ఏపీపై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక చంద్రబాబు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హాట్ లైన్ లో టచ్ లో ఉండటమే కారణమన్నారు. ఏపీలో గత ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలపై ఇప్పటివరకూ కాంగ్రెస్ నేతలు స్పందించలేదన్నారు.
ఇప్పటికే ఈసీ ముందు గత ఎన్నికల్లో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించామని జగన్ తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ మధ్య 12 శాతం ఓట్ల తేడా కనిపించిందన్నారు. పోలింగ్ తర్వాత కౌంంట్ లో రాష్ట్రంలో ఏకంగా 48 లక్షల ఓట్లు పెరిగాయన్నారు. దీనికి స్పందనగా ఏపీలోనూ ఓటర్ల జాబితా సవరణ చేస్తామని ఈసీ చెప్పిందన్నారు. అయినా దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం వెనుక కీలక కారణాలున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద విధానాలకు ఇది నిదర్శనం అన్నారు.

రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడకపోవడం వెనుక చంద్రబాబుతో టచ్ లో ఉండటమే కారణమని జగన్ ఆరోపించారు. ఏపీలో అరాచకాలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ఎప్పుడైనా మాట్లాడారా అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలపై మాత్రం వారు మాట్లాడరన్నారు.రాహుల్, రేవంత్, చంద్రబాబు హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారని జగన్ తెలిపారు. లేకపోతే రేవంత్, రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడరని అడిగారు.

తన హయాంలో పీపీఏలపై కోర్టులకు వెళ్లి ఆరోపణలు చేశారని, కానీ ఇప్పుడు పీపీఏలు అంతకన్నా ఎక్కువ రేట్లకు చేసుకుంటున్నారని, కానీ వీటిపై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదని జగన్ ప్రశ్నించారు. లులూ మాల్ విషయంలోనూ అదే జరుగుతోందన్నారు. రాహుల్ ఢిల్లీలో ఓట్ల చోరీ గురించి మాట్లాడుతూ ఏపీ గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అందుకే తాము కాంగ్రెస్ ఓట్ల చోరీ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదన్నారు.












Click it and Unblock the Notifications