తెలంగాణలో జగన్ గురి పెట్టిన ఐదు స్థానాలు ఇవే
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలంగాణపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఐదు పార్లమెంటు స్థానాలపై, 50 శాసనభా స్థానాలపై గురి పెట్టినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించాలంటే ఆరు శాతం ఓట్లు రావాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే జగన్ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు.
జగన్ సమైక్యాంధ్ర నినాదం తీసుకోవడంతో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తిగా బలహీనపడింది. తిరిగి పట్టాలపై పెట్టి తెలంగాణలో ఉనికిని చాటుకోవాలని వైయస్ జగన్ అనుకుంటున్నారు. ఇందుకు గాను, వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి వైయస్ విజయమ్మ, ఆయన సోదరి వైయస్ షర్మిల తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నాయి.

ఖమ్మం లోకసభ స్థానాన్ని గెలుచుకుంటామనే గట్టి నమ్మకంతో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గానికి ఆయన ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేరును ఆయన ప్రకటించారు. తెలంగాణలోని చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్ లోకసభ స్థానాల్లో కూడా పాగా వేయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో సీమాంధ్ర ఓటర్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో తెలంగాణవాదం బలంగా లేదని జగన్ నమ్ముతున్నారు. దీంతో ఈ ఐదు స్థానాలను గెలుచుకోగలమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలోని 50 శాసనసభా స్థానాలను జగన్ గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ స్థానాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గణనీయంగా, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొంత మేరకు ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications