మంత్రి జోగి రమేష్ సీటు ఖరారు- సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారాల్సిందేనా ?
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు కసరత్తు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు దశల్లో 38 మంది సీట్లలో ఇన్ చార్జ్ లను మార్చేసిన సీఎం జగన్.. ఇప్పుడు మూడో జాబితా విడుదలకు సిద్దమవుతున్నారు. ఇందులో పలువురు మంత్రులు, సీనియర్ల స్ధానాలు కూడా గల్లంతు కావచ్చనే ప్రచారం ఎలాగో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణాజిల్లా పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ సీటు కూడా మారిపోయింది.
పెడన నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న జోగి రమేష్ ఈసారి ఎలాగైనా నియోజకవర్గం మారాలనే పట్టుదలతో ఉన్నారు. పెడనలో మారుతున్న పరిస్దితుల నేపథ్యంలో అక్కడి నుంచి తప్పుకుని మైలవరంలో పోటి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో అక్కడి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూ, జోగికీ మధ్య వార్ నడిచింది. చివరకు సీఎం జగన్ జోక్యంచేసుకుని ఈ వార్ కు తెరదించారు. దీంతో వసంతకే అక్కడ టికెట్ ఖరారైంది. ఇప్పుడు జోగి రమేష్ కు టికెట్ కోసం పలు నియోజకవర్గాలు పరిశీలిస్తుండగా.. ఇందులో ఇప్పటికే బీసీ ఎమ్మెల్యే ఉన్న మరో సీటు ఖరారైంది.

కృష్ణాజిల్లాలోనే బీసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయిన కొలుసు పార్ధసారధి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో ఈసారి పార్ధసారధికి టికెట్ ఇచ్చేందుకు జగన్ ఇప్పటికే నిరాకరించారు. దీంతో పార్ధసారధి పక్క చూపులు చూస్తున్నారు. అదే సమయంలో పెనమలూరు సీటును జోగి రమేష్ కు ఖరారు చేస్తూ వైసీపీ అధిష్టానం ఇవాళ నిర్ణయం తీసుకుంది. జోగి రమేష్ తో పలు దఫాల చర్చల తర్వాత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే పెనమలూరు నుంచి తనకు టికెట్ ఖరారు కాదని తేలిపోవడంతో పార్ధసారధి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే టీడీపీలోనూ పెనమలూరు సీటు ఖాళీ లేకపోవడంతో ఆయనకు నూజివీడు సీటు కేటాయిచేందుకు టీడీపీ చర్చలు జరుపుతోంది. అదే సమయంలో పెనమలూరుకు నాన్ లోకల్ అయిన జోగి రమేష్ కు ఇక్కడి నుంచి సీటు కేటాయిస్తే అక్కడ పరిస్ధితులు ఎలా మారతాయన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications