ఎలాగూ రాను, ఆహ్వానమెందుకు!: మంత్రులతో జగన్, ఐనా వస్తా: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆహ్వానించనున్నారు.
సాయంత్రం కెసిఆర్ నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. అంతకంటే ముందు ఐదు గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలుస్తారు. కాగా, పలువురు ముఖ్య నేతలకు మంత్రులు శనివారం నాడు అమరావతి ఆహ్వాన పత్రాలను అందించారు.
ఏపీ కాంగ్రెస్ నాయకులు రఘువీరా రెడ్డి, చిరంజీవి, తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలకు మంత్రుల బృందం ఆహ్వాన పత్రాలు అందించింది. జానారెడ్డి అత్యంత అప్యాయంగా మాట్లాడారని మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు.

తెలంగాణ శాసన సభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలకూ ఆహ్వాన పత్రాలు అందించారు. తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కూడా కలిసి ఆహ్వానించారు.
టైం ఇవ్వని జగన్
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ కోసం మంత్రులు శుక్రవారం విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం జగన్‌ను కలిసే విషయమై చెప్తామని పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి చెప్పారు. దీంతో, మంత్రి అయ్యన్న... వైవికి ఫోన్ చేశారు.
జగన్‌తో మాట్లాడి చెప్తామని ఆయన బదులిచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేయగా... ఎలాగూ అమరావతి శంకుస్థాపనకు వచ్చేది లేదని, అలాంటప్పుడు ఇక ఆహ్వాన పత్రం ఎందుకని అంటున్నారని చెప్పారని తెలుస్తోంది. కలిసి ఆహ్వానపత్రం ఇస్తామని చెప్పగా టైమ్ ఇవ్వలేదని తెలుస్తోంది.
అయినా వస్తా: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆహ్వాన పత్రంను మంత్రులు ఇచ్చారు. ఆ తర్వాత పవన్ మాట్లాడుతూ... శంకుస్థాపన సమయానికి తాను గుజరాత్‌లో షూటింగులో ఉంటానని, అయినా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని మంత్రులకు చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications