షర్మిలను అడ్డుపెట్టి బాలయ్యను లాగిన జగన్-ఒకే దెబ్బకు రెండు పిట్టలు..!
ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి పార్టీల నేతలే లక్ష్యంగా సాగిన సోషల్ మీడియా దాడికి ప్రతీకారం తీర్చుకుంటున్న కూటమి సర్కార్ ఓవైపు.. అలాగే వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ చెల్లెలు షర్మిల చేస్తున్న మాటల దాడి మరోవైపు రాజకీయాన్ని రంజుగా మార్చేశాయి. ఇలా తనను టార్గెట్ చేస్తున్న వీరిద్దరికీ వైఎస్ జగన్ ఒకే దెబ్బతో ఘాటు కౌంటర్ ఇచ్చారు. దీంతో అటు ప్రభుత్వం కానీ, ఇటు షర్మిల కానీ మాట్లాడలేని పరిస్ధితి ఎదురవుతోంది.
నెల రోజులుగా ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా ప్రభుత్వం అరెస్టులు, కేసులకు దిగుతోంది. అదే సమయంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా గతంలో తనతో పాటు తల్లి విజయమ్మను కూడా వైసీపీ సోషల్ మీడియాతో టార్గెట్ చేయించిన జగన్ పై భగ్గుమంటున్నారు. దీంతో డిఫెన్స్ లో పడినట్లు కనిపించిన వైఎస్ జగన్ నిన్న వీళ్లిద్దరికీ ఒకేసారి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా కూటమి, వైసీపీ ఇద్దరికీ ఉమ్మడి బాధితురాలు అయినా కేవలం తనను మాత్రమే టార్గెట్ చేస్తున్న షర్మిలకు జగన్ సరైన కౌంటర్ ఇచ్చారు.

గతంలో అన్న జగన్ తో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలోని సాక్షి ఛానల్ కు వైఎస్ షర్మిల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో టీడీపీ ఎమ్మెల్యే కమ్ చంద్రబాబు బావమరిది కూడా అయిన నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచి తనపై జరిగిన సోషల్ మీడియా దాడిని షర్మిల తీవ్రంగా ఆక్షేపించారు. అంతే కాదు దీనికి ఆధారంగా ఆ పోస్టులు పెట్టిన ఐపీ అడ్రస్ లు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు ఆ వీడియోను నిన్న జగన్ తన ప్రెస్ మీట్లో బయటపెట్టారు.
షర్మిల అప్పట్లో బాలకృష్ణపై చేసిన విమర్శలను గుర్తుచేస్తూ ఇప్పుడు జగన్ ఆ వీడియో బయటపెట్టడం వెనుక రెండు ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది సోషల్ మీడియా పోస్టుల విషయంలో ప్రభుత్వం వైసీపీపై చేస్తున్న దాడిని తిప్పికొట్టేలా బాలకృష్ణ గతంలో చేసిందీ ఇదేగా అన్న విషయాన్ని బయటపెట్టారు. అలాగే కూటమిలో భాగమైన బాలయ్య తనను గతంలో టార్గెట్ చేసినా అది వదిలేసి కేవలం వైసీపీ మాత్రమే టార్గెట్ చేసిందని చెప్పుకుంటున్న షర్మిలకూ కౌంటర్ ఇచ్చినట్లయింది. అలా ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లయింది.












Click it and Unblock the Notifications