జగన్‌కు రాజకీయ గడ్డుకాలం: వలసలకు నో బ్రేక్, విఫలమంటూ విమర్శలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అని ఎవరినడిగినా ఠక్కున చెప్పేస్తారు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరుతున్న ఫిరాయింపుదారులతో వైయస్ జగన్‌కు ఊపిరిసలపనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు.
అంతేకాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వలస వెళుతున్న వారిని ఎలా ఆపాలో తెలియక వైయస్ జగన్ సతమతం అవుతున్నారు. ఉదయాన్నే వైసీపీలో ఉన్నామని చెబుతూనే సాయంత్రానికి టీడీపీ కండువా కప్పుకొని జగన్‌కు షాకిస్తున్నారు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.
పార్టీని వీడుతారని అనుమానం వచ్చిన ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నా ఫిరాయింపులు మాత్రం ఆగడం లేదు. ఎప్పుడు ఎవరు పోతారో తెలియని పరిస్థితి. పార్టీని వీడి వెళ్లేవారిపై ఆగ్రహం ఉన్నా... ఉన్నవారిపై వైయస్ జగన్ అపనమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది.

పార్టీలో జగన్ తరువాత రెండు, మూడు స్థాయి హోదాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ సైతం జగన్‌కు హ్యాండిచ్చిన నేపథ్యంలో, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్టు ఆదివారం వార్తలు వచ్చాయి. ఇప్పటికే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు తమ చేరికను స్పష్టం చేశారు.
ఇక సర్వేశ్వరరావు గురువారం (28న) టీడీపీలోచేరనున్నారు. విశాఖపట్నంలో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఇటీవలే సైకిలెక్కిన వైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ సర్వేశ్వరరావుతో దీనిపై చర్చించారు. ఈ భేటీలో తాను అభివృద్ధి కార్యక్రమాల కోసం టీడీపీలో చేరేందుకు సిద్ధమేనని సర్వేశ్వరరావు ప్రకటించారు.
అయితే గిరిజన హక్కులు, జీవన విధానాన్ని హరింపజేస్తున్న బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించాలన్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని అయ్యన్నపాత్రుడు చెప్పడంతో దీనికి అంగీకరించిన సర్వేశ్వరరావు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా పార్టీని ఫిరాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గొట్టిపాటి బుధవారం (27న) సీఎం సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒకరి తరువాత ఇంకొకరు పార్టీని వీడుతుంటే, వారిని ఎలాగైనా అడ్డుకోవడంలో జగన్ విఫలమవుతున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.
పోయేవారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఉన్నవారు ఎప్పుడు ఫిరాయిస్తారో అన్న అనుమానాల మధ్యే ఆయనకు రోజు గడిచిపోతోంది. చంద్రబాబు వైఖరి, ఎమ్మెల్యేల ఫిరాయింపులను అడ్డుకోవాలంటూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలను కలిసి ఫిర్యాదు చేసేందుకు మే మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లనున్నట్టు ప్రకటించిన ఆయన, తాజా పరిణామాలతో ఈ వారం చివర్లోనే ఢిల్లీకి పయనం కావాలని నిర్ణయించారు.
టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' వ్యవహారాన్ని ఢిల్లీలోని పెద్దల వద్ద ప్రస్తావించేందుకే ఆయన ఢిల్లీకి పయనమైనట్లు తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి పార్టీలు మారేందుకు ప్రోత్సహిస్తున్నారని, వీరిపై అనర్హత వేటు వేయాలని ఆయన ఫిర్యాదు చేయనున్నారు.
ప్రస్తుతం ఏపీలో ఈ ఫిరాయింపు వల్ల ప్రజా సమస్యలపై పోరాటాన్ని సైతం పక్కనబెట్టి, ఎమ్మెల్యేల వలసలను అడ్డుకోవడంపైనే దృష్టిని సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గవర్నర్ ను కలిసి ఇదే విషయాన్ని విన్నవిస్తే, ఆయన తాను చేయగలిగిందేముందని అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వలసలకు జగన్ ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications