కొణతాల అంటే జగన్‌కు భయం!: బాబ్జీ తీవ్ర వ్యాఖ్య
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఝలకిచ్చారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధిష్ఠానానికి రాజీనామా పత్రం పంపించారు.
పెందుర్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు అంతా కలసి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వెంటే నడుస్తామని అందులో పేర్కొన్నారు. కొణతాల సభ్యత్వాన్ని రద్దు చేసే ముందు కనీసం ఆయన అభిమతాన్ని, సమస్యకు కారణం కూడా తెలుసుకోలేదని బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్‌కు పెద్ద నాయకులంటే భయమని, అందుకే వారిని పార్టీకి దూరం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. తనతో పాటు 20 మంది సర్పంచులు, 18 మంది ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. పెద్ద నాయకుల భయం కారణంగా జగన్ ఒక్కరొక్కరిని పంపిస్తున్నారని ఆరోపించారు.
జగన్‌కు సీనియర్ల ఫోబియా పట్టుకుందన్నారు. అసలు జగన్ తనను తానే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తన కుర్చీ లాక్కుంటారనే భయంతో సీనియర్లను దూరం చేస్తున్నారన్నారు. విజయమ్మ ఓటమికి కొణతాల రామకృష్ణ ఎలా బాధ్యుడవుతారో చెప్పాలన్నారు.

చంద్రబాబు పైన ఉమ్మారెడ్డి ధ్వజం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బుధవారం సాయంత్రం నిప్పులు చెరిగారు. బాబు పచ్చి అబద్ధాలకోరని, అబద్ధాలలో ఆయన గోబెల్స్‌ను మించిపోయారని విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల హామీలను చంద్రబాబు గాలికొదిలేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications