విభజనపై బాబుతో పోరు: సోనియాపై జగన్ నిందలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మొదటిసారి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు ప్రస్తావించి ఆమెను తప్పు పట్టారు. కాంగ్రెసును మాత్రమే ఇంత వరకు విమర్శిస్తూ సోనియాను పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పదే పదే ఎత్తిచూపారు. కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే జగన్ సోనియాను విమర్శించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న సోనియాను విమర్శించకుండా జగన్ తనను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో వైయస్ జగన్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయన సోనియాను రాష్ట్ర విభజనకు తప్పు పడుతూ మాట్లాడారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శనివారం ఉదయం నిరవధిక నిరాహార దీక్షకు దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన అన్నారు. కొడుకు రాజకీయ జీవితం కోసం తమ జీవితాలతో చెలగాటం ఆడవద్దని ఆయన సోనియాకు సూచించారు.

కేవలం ఓట్ల కోసం సీట్ల కోసమే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజనను అంగీకరించవద్దని ఆయన పార్లమెంటులో ప్రతిపక్షాలను కోరారు. ఒకవేళ రాష్ట్ర విభజనకు పార్టీలన్నీ అంగీకరిస్తే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలను కూడా ఓట్లు, సీట్ల కోసం విభజిస్తారని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు బాగా లేదని జగన్ అన్నారు. సమైక్య రాష్ట్రం కావాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరుకుంటే అసెంబ్లీని సమావేశపరిచి విభజనకు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ముందుకు ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఉంటే దేశమంతా ఆలోచించేదని ఆయన అన్నారు. దాంతో రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేదని జగన్ అభిప్రాయపడ్డారు.
గతంలో జగన్ సోదరి వైయస్ షర్మిల తన సమైక్య శంఖారావం యాత్రలో సోనియాను తప్పు పట్టారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సోనియా తీసుకున్నారని ఆమె అన్నారు. అయితే, జగన్ మాత్రం సోనియా పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేస్తూ వచ్చారు.












Click it and Unblock the Notifications