ఎల్లుండి జగన్ వద్దకు చిరు, నాగ్-తేలిపోనున్న సినీ టికెట్ల రచ్చ-ఉద్యోగుల తరహాలోనే
ఏపీలో కొంతకాలంగా వివాదాస్పమవుతున్న సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలికేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ అంశంపై ఇప్పటికే టాలీవుడ్ తరఫున మెగాస్టార్ చిరంజీవి వచ్చి సీఎం జగన్ తో చర్చించి వెళ్లారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా పలువురు టాలీవుడ్ పెద్దలతో భేటీ అయ్యేందుకు వీలుగా జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో వారు ఎల్లుండి ఏపీకి వచ్చి చర్చలు జరపబోతున్నారు.

టాలీవుడ్ ను కరుణించిన జగన్
సినిమా టికెట్ల వివాదం నేపథ్యంలో టాలీవుడ్ తో పెరిగిన దూరం నేపథ్యంలో ఎట్టకేలకు సినీ పరిశ్రమను కరుణించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే సినిమా టికెట్లతో పాటు పలు అంశాల్లో టాలీవుడ్ ను టార్గెట్ చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు వాటిపై నియమించిన కమిటీ రిపోర్ట్ తీసుకుని మరీ టాలీవుడ్ పెద్దలతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. దీంతో సినిమా టికెట్ల ధరలతో పాటు షోలు, ఇతర వ్యవహారాలపై క్లారిటీ రాబోతోంది. ఇందుకోసం ఎల్లుండి ముహుర్తంగా నిర్ణయించారు.

ఎల్లుండి చిరు, నాగ్ కు అపాయిుంట్ మెంట్
టాలీవుడ్ తరఫున జగన్ కు సన్నిహితులుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు నిర్మాతలు ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతున్నారు. దీంతో వీరిని భాగస్వాముల్ని చేస్తూ తదుపరి చర్చల కోసం ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎల్లుండి ఫిబ్రవరి 10న చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు పెద్ద సినిమాల నిర్మాతలు తనను కలిసేందుకు జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇందులో పాన్ ఇండియా సినిమాలైన ఆర్ఆర్ఆర్, రాథేశ్యామ్ చిత్రాల నిర్మాతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం వారు ఎల్లుండి తాడేపల్లి వచ్చి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో చర్చలు జరపబోతున్నారు.

చర్చల అజెండా ఇదే
సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దలు జరిపే చర్చల్లో ప్రధానంగా టికెట్ల ధరలపై నియంత్రణ, షోలపై నియంత్రణ, థియేటర్లకు అనుమతులు వంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాలపై ప్రభుత్వం జీవో కూడా జారీ చేసి ఏపీ ఎఫ్డీసీ ద్వారా వెబ్ సైట్ ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి కూడా చిరు, నాగ్, నిర్మాతలు తమ ప్రతిపాదనలతో ఎల్లుండి జగన్ ను కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని ఇవాళ సీఎం జగన్ ను కలిసి తాజా పరిస్దితిని ఆయనకు వివరించారు. ఎల్లుండి జరిగే భేటీలో చర్చలు జరిపేందుకు వీలుగా అన్ని అంశాలను సీఎంకు ఆయన వివరించినట్లు తెలుస్తోంది.

జగన్ తేల్చేస్తారా ?
టాలీవుడ్ సినిమా టికెట్ల ధరల వ్యవహారంతో పాటు ఇతర అంశాల్లోనూ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ హీరోలు, నిర్మాతలకు ఇచ్చిన అపాయింట్ మెంట్ పై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. టాలీవుడ్ ప్రముఖులతో ఈసారి జరపబోయే భేటీలో అన్ని అంశాలపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ చిరంజీవితో గతంలో జరిగిన భేటీలోనే క్లారిటీ ఇచ్చేశారు. ఈసారి భేటీలో వాటిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే ఉద్యోగుల తరహాలోనే టాలీవుడ్ తో నెలకొన్న సమ,స్యకు కూడా జగన్ ఈ భేటీలోనే పరిష్కారం చూపుతారని అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications