YS Jagan : గవర్నర్ హరిచందన్ పై జగన్ అదే అప్యాయత-పాదాభివందనంతో వీడ్కోలు..
ఏపీ నుంచి బదిలీపై ఛత్తీస్ ఘడ్ వెళ్తున్న గవర్నర్ హరిచందన్ కు విజయవాడ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ అధికారికంగా వీడ్కోలు పలికారు.
ఏపీలో దాదాపు మూడున్నరేళ్ల పాటు గవర్నర్ గా కొనసాగిన విశ్వభూషణ్ హరిచందన్ కు ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. నిన్న విజయవాడలో గవర్నర్ కు వీడ్కోలు పలికేందుకు భారీ సభ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇవాళ కూడా అధికారికంగా ఎయిర్ పోర్టులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రం నుంచి బదిలీపై వెళ్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వెంట ఉంటూ వీడ్కోలు పలికారు. నిన్న ఆయనకు వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిన జగన్.. గవర్నర్ సేవలపై ప్రశంసల జల్లు కురిపించారు. తండ్రిలా వాత్సల్యం కురిపించారని ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి స్పందనగా గవర్నర్ కూడా ఏపీ తనకు రెండో స్వస్ధలం అని, ఏపీని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని తెలిపారు.

ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ దంపతులకు అధికారిక వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం రాజ్ భవన్ నుంచి ఎయిర్ పోర్టుకుచేరుకున్న గవర్నర్ దంపతులకు సీఎం జగన్, మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మరోసారి సీఎం జగన్ గవర్నర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.ఎన్నడూ లేని తరహాలో గవర్నర్ కు సీఎం జగన్ పాదాభివందనం చేశారు. దీంతో గవర్నర్ కూడా సొంత కుమారుడి తరహాలో జగన్ పై ఆప్యాయత ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టులో కనిపించిన ఈ దృశ్యాలు చూపరుల్ని ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications