చంద్రబాబు ఎన్నికల హామీని ముందే అమలు చేసేసిన జగన్..!
ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాము అమలు చేస్తామని విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఓ హామీని సీఎం వైఎస్ జగన్ ఇప్పుడే అమలు చేసేశారు. తద్వారా టీడీపీ అమ్ముల పొదిలోని ఓ అస్త్రాన్ని లాగేసుకున్నట్లయింది.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రైతుల ఆకాంక్షలకు విరుద్ధంగా యూ1 జోన్ ఏర్పాటైంది. దీన్ని రద్దు చేయాలంటూ రైతులు పలుమార్లు దీక్షలు, నిరసనలు, ర్యాలీలు చేశారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీనిపై రైతులు ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంగళగిరి సమీపంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, లోకేష్ తాము అధికారంలోకి వచ్చాక యూ1 జోన్ ఎత్తేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో అమరావతి రైతులు కూడా టీడీపీలో చేరారు.

దీంతో ఎన్నికల్లో టీడీపీకి లబ్ది కలుగుతోందని భావించిందో ఏమో.. వైసీపీ సర్కార్ హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి యూ1 జోన్ ను ఎత్తేస్తూ నిర్ణయం ప్రకటించింది. అంతే కాదు దీనిపై గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేసింది.
ఎలాంటి షరతులు లేకుండానే యూ-1 జోన్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం ఇచ్చిన హామీని ఇప్పటికిప్పుడే అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది.












Click it and Unblock the Notifications