రఘురామ డిమాండ్ నెరవేర్చిన వైఎస్ జగన్ ? ఆ కీలక అధికారిపై వేటు- నో పోస్టింగ్!
ఏపీలో నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కీలక అధికారిగా వ్యవహరించిన ఆయనపై ఇవాళ వేటు పడింది. ముఖ్యంగా సీఎం జగన్ కు ప్రీతిపాత్రుడిగా, అలాగే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పీడకలగా మారిపోయిన ఆయన్ను ఇవాళ ప్రభుత్వం అనూహ్యంగా కీలక విభాగం నుంచి సాగనంపింది. అంతే కాదు తదుపరి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇది సాధారణ బదిలీల్లో భాగంగా జరిగింది కాదనే వాదనే.

సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ పై వేటు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఐడీ ఛీఫ్ గా నియమించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై ఇవాళ అనూహ్యంగా బదిలీ వేటు పడింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికీ, ముఖ్యంగా సీఎం జగన్ కు నోట్లో నాలుకలా వ్యవహరిస్తున్న పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం ఇవాళ హఠాత్తుగా ఆ పదవి నుంచి తప్పించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. దీంతో సునీల్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఎందుకింత ఆకస్మిక నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది.

సునీల్ కు నో పోస్టింగ్
పీవీ సునీల్ కుమార్ ను సీఐడీ ఛీఫ్ పదవి నుంచి తప్పించిన ప్రభుత్వం.. ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఆయన్ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని జీవోలో పేర్కొంది. దీంతో సునీల్ కుమార్ పోస్టింగ్ కోసం ఎదురుచూడక తప్పేలా లేదు. మరోవైపు సునీల్ కుమార్ స్ధానంలో సీఐడీ ఏడీజీగా ఎన్. సంజయ్ ను నియమించింది. అంతే కాదు ప్రస్తుతం ఆయన చూస్తున్న విపత్తు నిర్వహణతో పాటు ఫైర్ డీజీ గా కూడా సంజయ్ కు అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో ఆయన రెండు బాధ్యతల్లో కొనసాగబోతున్నారు.

ఆకస్మిక వేటుపై చర్చ?
వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న పీవీ సునీల్ కుమార్ ను ఆకస్మికంగా తప్పించడం వెనుక కారణాలపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ సునీల్ పై వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పలు ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచింది. అలాగే సునీల్ కు తాజాగా డీజీగా ప్రమోషన్ కూడా ఇచ్చింది.
దీంతో సునీల్ ను 2024 ఎన్నికల వరకూ కొనసాగిస్తారని భావించారు. కానీ సునీల్ పై అనూహ్యంగా వేటు వేశారు. గతంలో డీజీపీగా పనిచేసిన గౌతం సవాంగ్, సీఎస్ గా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం తరహాలోనే సునీల్ పైనా వేటు పడిందనే చర్చ జరుగుతోంది.

రఘురామ కల నెరవేర్చిన జగన్?
సీఐడీ ఛీఫ్ గా ఉండగా.. జగన్ సర్కార్ చెప్పినట్లు వినే క్రమంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామను పీవీ సునీల్ కుమార్ దారుణంగా టార్గెట్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రఘురామపై రాజద్రోహం కేసు, సీఐడీ కస్టడీలో వేధింపులు, ఆ తర్వాత కేసులతో రఘురామను సునీల్ ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే రఘురామ కూడా సునీల్ పై కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖతో పాటు హోంశాఖకూ పలు ఫిర్యాదులు చేశారు.
అయితే వీటి విషయంలో కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడితోనే సునీల్ ను బదిలీ చేసి ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా సునీల్ ను సీఐడీ ఛీఫ్ గా తప్పించాలని రఘురామ చేస్తున్న డిమాండ్ ను మాత్రం జగన్ నెరవేర్చినట్లయింది.












Click it and Unblock the Notifications