వీఆర్వోలకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్-ఈ డిమాండ్లకు మోక్షం..!
ఏపీలో గ్రామ రెవిన్యూఅధికారులకు (వీఆర్వోలు) సీఎం వైఎస్ జగన్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి అంగీకారం తెలిపారు. ఈ మేరకు తనను కలిసిన గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులకు జగన్ ఈ మేరకు వెల్లడించారు. దీంతో సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ తమ సమస్యలు పరిష్కరించిన జగన్.. మరోసారి మిగిలిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వీఆర్వో అసోషియేషన్ కు ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు ఆధ్వర్యంలో సీఎం జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్బంగా వీఆర్వోలకు సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించి ఓ వినతి పత్రాన్ని కూడా అందించారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.

అర్హత కల్గిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని సంఘం ప్రతినిధులు జగన్ ను కోరారు. ప్రస్తుతం వీఆర్వోల పదోన్నతుల్లో 40 రేషియో శాతం అమల్లో ఉందని, దీనివల్ల చాలా మంది వీఆర్వోలకు సీనియర్ సహాయకుల పోస్టులు రావడం లేదు కాబట్టి వీఆర్వోల పదోన్నతుల్లో 70 శాతం రేషియో ఇవ్వాలని సీఎం ను కోరామని వివరించారు. ఎక్కువ మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా విధి నిర్వహణలో ఎవరైనా వీఆర్వో చనిపోతే అతని కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం ఇవ్వాలని కూడా సీఎం జగన్ ను వారు కోరారు. రాష్ర్ట వ్యాప్తంగా వీఆర్ఏల నుంచి వీఆర్వో ప్రమోషన్ కు అర్హత కల్గిన వారు 1500 మంది వరకు ఉన్నారు. వీరందరికీ అర్హత పరీక్ష నిర్వహించి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. వీటిపై జగన్ సానుకూలంగా స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
తమ పెండింగ్ సమస్యలపై సీఎం జగన్ ఇచ్చిన హామీపై వీఆర్వోల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రెవిన్యూ ఉద్యోగులందరూ వైయస్ జగన్ కు రుణపడి ఉంటారన్నారు. వీఆర్వోలు, వీఆర్ఏలకు సంబంధించిన పలు సమస్యల్ని ఇప్పటికే జగన్ పరిష్కరించారని, మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications