కేడర్ కోరుకున్న విధంగా..మలచుకుంటోన్న జగన్
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.
జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. క్యాడర్‌లో ఊపు తెచ్చే నిర్ణయాలను తీసుకుంటోన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వేగంగా కోలుకున్న జగన్..నూతనోత్తేజాన్ని నింపేలా 2.0ను సిద్ధం చేస్తోన్నారు.

ఈ క్రమంలో వైఎస్ జగన్ గురువారం మీడియా ముందుకు రానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్రం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకుని వచ్చే అవకాశం లేకండాపోయిందని వైఎస్ జగన్ భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు ప్రస్తావించారు కూడా. ప్రతిపక్ష హోదా కోసం చట్టపరంగా పోరాటం కూడా చేశారాయన.
ప్రతిపక్ష హోదా లభిస్తే ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడటానికి తగినంత సమయం లభిస్తుందని, ఈ హోదా ఇవ్వడానికి చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం నిరాకరిస్తోందంటూ జగన్ గతంలో చెప్పుకొచ్చారు. మైక్ ఇవ్వని పరిస్థితుల్లో తాను తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానంటూ గతంలో ప్రకటించారు కూడా.
అప్పటి నుంచి వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై తరచూ నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ వస్తోన్నారు. క్షేత్రస్థాయిలోనూ పర్యటనలు నిర్వహిస్తోన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కొనసాగిన సంక్షేమం ఆగిపోవడం, ఉద్దేశపూరకంగా అన్ని వర్గాల లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుండడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.
అదే సమయంలో- తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా అటు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తోన్నారు. రీజినల్ కోఆర్డినేటర్లు మొదలుకుని.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వరకూ ఈ భేటీ కొనసాగించిన విషయం తెలిసిందే. జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ- పార్లమెంట్ ఇన్ ఛార్జీలు, కన్వీనర్లతో తరచుగా భేటీలను నిర్వహిస్తోన్నారు జగన్.
ఎన్నికల సమయంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి లేనిపోని అపోహలు, అనుమానాలను సృష్టించిందని, దీనివల్ల కొన్ని వర్గాలు తమకు దూరం అయ్యారని జగన్ భావిస్తోన్నారు. వాళ్లందరిని కూడా మళ్లీ పార్టీ వైపు ఆకర్షితులను చేసేలా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications