మహిళల్లో కొండంత ఆత్మవిశ్వాసం.. కోటి జనాభాకు మంచి జరిగే గొప్ప కార్యక్రమం : వైఎస్ జగన్
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్ల వయసున్న మహిళలకు వైయస్సార్ చేయూత పథకం ద్వారా 18,750 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం అందించిన జగన్
సీఎం క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండవ ఏడాది 23,14,342 మంది మహిళలకు వైయస్సార్ చేయూత అందించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళలకు కొండంత అండగా ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పిన ఆయన, ప్రతి కుటుంబానికి మహిళలే రథసారథులు అన్నారు. వైయస్సార్ చేయూత ద్వారా రెండేళ్లలో 9 వేల కోట్ల సాయం చేశామని, ఆర్థిక సహాయం అందించటమే కాకుండా జీవనోపాధికి కూడా తోడ్పాటు అందిస్తామని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించే దిశగా జగన్ సర్కార్ యత్నం
మహిళలు ఆర్థిక స్వావలంబన సాగించే దిశగా ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా మహిళలకు సహకారం అందిస్తుందని 78 వేల మంది మహిళలు కిరాణా షాపులు పెట్టుకున్నారని గుర్తు చేశారు. లక్షా 19 వేల మహిళలు ఆవులు, గేదెలు కొనుగోలు చేసుకుని, పాడి చేసుకుంటున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఏపీ క్యాబినెట్ లోని మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు నామినేటెడ్ పదవులు కూడా కేటాయించామని సీఎం జగన్ వివరించారు.

మహిళల చేతిలో డబ్బు పెడితే మంచి జరుగుతుంది
మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, వారి రక్షణకై పోలీస్ స్టేషన్ లను కూడా ఏర్పాటు చేశామని చెప్పిన జగన్ గ్రామ,వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించామని చెప్పుకొచ్చారు. మహిళలకు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత మరే ఇతర ప్రభుత్వాలు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. సీఎం జగన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వైయస్సార్ చేయూత అందుతుందని స్పష్టం చేశారు. కోటి జనాభాకు మంచి జరిగే గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నామని, మహిళల చేతిలో డబ్బు పెడితే అంతా మంచే జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications