మేడిన్ ఇండియా బాహుబలి హైడ్రోజన్ రైలుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్.. విశేషాలివే
బొగ్గు రైళ్ల నుంచి డిజిల్, ఆపై విద్యుత్ ఆధారిత రైళ్ల వరకు భారతీయ రైల్వే గణనీయమైన పరిణామాన్ని చూసింది. ఇప్పుడు హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై పరుగులు తీసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎలక్ట్రిక్ రైళ్లతో పోలిస్తే నిర్వహణ, ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ హితంగా ఉండే ఈ రైళ్లు భారత రైల్వే వ్యవస్థ గతిని పూర్తిగా మార్చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తొలి హైడ్రోజన్ రైలు కార్యకలాపాలకు రైల్వే ఆమోదం
'మేడిన్ ఇండియా'లో తయారైన దేశ తొలి హైడ్రోజన్ రైలు కార్యకలాపాలకు రైల్వే ఆమోదం తెలిపింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇది హర్యానాలోని జీంద్ నుంచి సోనీపథ్ మధ్య తన తొలి ప్రయాణం చేయనుంది. పది బోగీలు కలిగిన ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీని శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం మొత్తం 2,400 కిలోవాట్లు.

పొగకు బదులుగా నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేసే హైడ్రోజన్ రైలు
భారత హైడ్రోజన్ రైలు ఇంజిన్ ఇతర దేశాల్లో నడుస్తున్న వాటితో పోలిస్తే 'బాహుబలి' ఇంజిన్‌కు సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థ సాయంతో పనిచేసే ఈ రైళ్లు పొగకు బదులుగా నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తాయి. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ఇప్పటికే సేవలను అందిస్తున్నాయి.
రూ.80 కోట్లు ఖర్చుతో హైడ్రోజన్ రైలు
ఈ హైడ్రోజన్ రైలు తయారీకి దాదాపు రూ.80 కోట్లు ఖర్చయింది. జీంద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రోజన్ ప్లాంట్ కోసం రూ.120 కోట్లు కేటాయించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీని బోగీలు తయారయ్యాయి. ఆధునిక ఇంటీరియర్ డిజైన్, ఆటోమేటిక్ డోర్లు, డిజిటల్ డిస్‌ప్లేలు వంటివి ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందిస్తాయి.
బొగ్గు రైళ్ళ నుండి విద్యుత్ రైళ్ళ వరకు పలు సవాళ్లు
బొగ్గు రైళ్లు వాతావరణ కాలుష్యం, అధిక నిర్వహణ ఖర్చులతో సమస్యలను సృష్టించాయి. డీజిల్ ఇంజిన్ రైళ్లు కూడా కాలుష్యాన్ని పెంచాయి, వాటి నిర్వహణ వ్యయాలు అధికంగా ఉన్నాయి. విద్యుత్ రైళ్లు నిర్వహణ ఖర్చులు తగ్గించినా, ట్రాక్‌ల విద్యుదీకరణకు పెద్దఎత్తున పెట్టుబడులు, తరచుగా కేబుళ్లు తెగిపోవడం, వాటి మరమ్మతులకు అధిక వ్యయం వంటి సవాళ్లను రైల్వే శాఖ ఎదుర్కొంటోంది.
కాలుష్యాన్ని తగ్గించే హైడ్రోజన్ రైలు
అధికంగా లభించే హైడ్రోజన్‌తో అతి తక్కువ ఖర్చుతో రైళ్లను నడిపించడం వల్ల రైల్వేపై ఆర్థిక భారం తగ్గుతుంది. అంతేకాకుండా, పర్యావరణానికి ఎలాంటి హానీ లేకుండా, అతి తక్కువ శబ్దంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. అధిక కాలుష్యం, నిర్వహణ వ్యయాలను తగ్గిస్తూ, నిశ్శబ్ద ప్రయాణాన్ని అందించడంలో హైడ్రోజన్ రైళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న హైడ్రోజన్ రైళ్ళ సాంకేతికత
ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు 2018లో జర్మనీలో ప్రయాణం మొదలుపెట్టింది. ఆ రైలు సీటింగ్ సామర్థ్యం 150 కాగా, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. ప్రస్తుతం చైనా, జపాన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు సేవలను అందిస్తున్నాయి. ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారత్‌తో పాటు కెనడా, ఇటలీ, సౌదీ అరేబియా, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, పోలాండ్, స్వీడన్ వంటి తొమ్మిది దేశాలు హైడ్రోజన్ రైళ్ల ట్రయల్స్‌ను ఇప్పటికే పూర్తి చేశాయి.
ఈ మార్గాలలో హైడ్రోజన్ రైళ్ళను ప్రవేశపెట్టే ప్లాన్
ఈ ఆధునిక సాంకేతికతపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది.భవిష్యత్తులో హైదరాబాద్ - తిరుపతి మధ్య (నల్లగొండ, కడప మీదుగా, గుంటూరు వెళ్లకుండానే) వంటి కీలక మార్గాల్లోనూ ఈ అత్యాధునిక రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. హైడ్రోజన్ రైళ్ల రాక భారత రైల్వేల భవిష్యత్తుకు ఒక శుభసూచకం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications