వంశీ కేసుల వేళ గన్నవరం పై జగన్ ఊహించని నిర్ణయం..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అవుతోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి 2029 ఎన్నికలకు వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రభుత్వం పైన ఇప్పటి కే వ్యతిరేకత పెరిగిందని చెబుతున్న జగన్.. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. పలు కేసు ల్లో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఇక.. వరుసగా నమోదైన కేసులతో వంశీ జైలులో ఉన్నారు. దీంతో, గన్నవరం లో కూటమి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. గన్నవరం కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
గన్నవరంలో మారిన సీన్
గన్నవరం నుంచి టీడీపీఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత ఆ పార్టీకి దగ్గరయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ, చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా ఫైర్ అయ్యారు. అనుచిత వ్యాఖ్యలు చేసారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. వంశీ వైసీపీ లోకి వచ్చిన సమయంలో అక్కడ పార్టీ నేత లు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్ర రావును కాదని.. జగన్ తన పార్టీలోకి వచ్చిన వంశీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా వెంకటరావు టీడీపీలోకి వెళ్లి.. అక్కడ నుంచి వంశీ పైన ఎమ్మెల్యే గెలుపొందారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా నమోదైన కేసులతో వంశీ చాలా రోజులుగా జైల్లోనే ఉన్నారు.

జగన్ కీలక నిర్ణయం
వంశీ పైన ఎనిమిది కేసులు నమోదు కాగా, ఏడు కేసుల్లో బెయిల్ దక్కింది. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దీంతో, వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది. వంశీ అరెస్ట్ తరువాత గన్నవరం లో వైసీపీ కేడర్ డైలమాలో ఉంది. వంశీ సుదీర్ఘ కాలం జైలులో ఉండటం.. నియోజకవర్గంలో కూటమి పార్టీలు తమ పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తమ పార్టీ నేతలకు గాలం వేయటంతో వారు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిని గమనించిన జగన్ గన్నవరంలో పరిస్థితి పైన మాజీ మంత్రి పేర్ని నానితో చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వంశీ మద్దతు దారులు.. వైసీపీ కేడర్ తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వంశీ సతీమణితోనూ మాట్లాడారు. వంశీ సతీమణి తో కలిసి పార్టీ కేడర్ తో సమావేశానికి నిర్ణయించారు. రేపు (శనివారం) గన్నవరంలో ఈ సమావేశం జరగనుంది.
బాధ్యతలు అప్పగిస్తారా
వల్లభనేని వంశీ కేసులు.. అనారోగ్య సమస్యలతో వైసీపీ గన్నవరం బాధ్యతలను వంశీ సతీమణి పంకజశ్రీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వంశీ పూర్తిగా కోలుకొని తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యే వరకు ఆ బాధ్యతలను నిర్వహించనున్నారు. అయితే, వంశీ స్థానంలో రామచంద్ర రావు కుమార్తెను నియోజకవర్గ ఇంఛార్జ్ గా నియమిస్తారనే చర్చకు ఈ భేటీ ద్వారా స్పష్టత ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. వంశీ పైన కూటమి ప్రభుత్వం వేధింపుల్లో భాగంగా వరుస కేసులు నమోదు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. త్వరలోనే గన్నవరం వైసీపీ నేతలతోనూ జగన్ సమావేశం కావాలని నిర్ణయించారు. రేపు జరిగే సమావేశంలో పార్టీ నాయకత్వ ఆలోచనలు.. గన్నవరం లో చేపట్టే కార్యక్రమాల గురించి కేడర్ కు స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో వంశీ సతీమణి బాధ్యతల గురించి ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications