అమరావతిలో ఇళ్ల పట్టాలపై జగన్ కీలక ఆదేశాలు-వైజాగ్ బీచ్, కృష్ణా రివర్ బెడ్ పైనా..
ఏపీ రాజధాని అమరావతిలో గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందిన పేదలకు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసేందుకు కోర్టుల్లో అడ్డంకులు తొలగిపోవడంతో ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇవాళ జరిగిన మున్సిపల్ శాఖ సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే టిడ్కో ఇళ్ల పంపిణీ, రాష్ట్రంలో మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
అమరావతిలో పేదలకు ఇళ్ల పంపిణీని ఇళ్లు లేని నిరుపేదల చిరకాల వాంఛ నెరవేర్చే బృహత్త కార్యక్రమని సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. మొత్తం 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొత్తం 21 లే అవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వనున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లే అవుట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం జగన్ కు వెల్లడించారు. జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు ముగిశాయని తెలిపారు. దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్లు వేసే పనులుకూడా చేపడుతున్నట్లు వెల్లడించారు.అలాగే ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు అదనపు భవనం నిర్మాణం కూడా పూర్తవుతోందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
అనంతరం టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష చేశారు. ఇందులో టిడ్కో ఇళ్లలో ఫేజ్ -1 కు సంబంధించి 1,50,000 ఇళ్లలో ఇప్పటికే 1.39 లక్షలు పూర్తయినట్లు, 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. జూన్ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. రెండో విడతకు సంబంధించిన 1,12,092 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామన్నారు. గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధంచేస్తున్నట్లు వెల్లడించారు. జూన్ మొదటి వారంలో సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్నారు.

ఆ తర్వాత విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం వారికి సూచించారు. దీనికి అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. వీటి ద్వారా బీచ్‌లో వ్యర్థాలను తొలగించాలన్నారు. పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మరింత మెరుగుపడుతుందన్నారు. అలాగే విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడ్డ రివర్ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రివర్ బెడ్‌పై వాకింగ్ ట్రాక్ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్ పనులను సీఎంకు అధికారులు వివరించారు. దీంతో విజయవాడ నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా దీన్ని తీర్చిదిద్దాలని సూచించారు.












Click it and Unblock the Notifications