ఏపీ ఆర్ధిక పరిస్ధితి భేష్- చంద్రబాబు,కేంద్రం అప్పుల కంటే బెటర్- అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు
ఏపీలో ఆర్ధిక పరిస్ధితి నానాటికీ దిగజారుతోందంటూ విపక్షాలు నిత్యం విమర్శలు చేస్తున్న వేళ..వాస్తవ పరిస్ధితిని ప్రజలకు వివరించేందుకు వైసీపీ సర్కార్ ఇవాళ అసెంబ్లీలో కీలక చర్చ చేపట్టింది. రాష్ట్ర ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శల్ని తిప్పికొట్టేందుకు సభలో వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు ప్రయత్నించారు. చివరగా ముగింపు ప్రసంగం చేసిన సీఎం జగన్.. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై వివక్షాలు, ఎల్లో మీడియా కలిసి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం ఆర్ధిక పరిస్ధితి కూడా అంతంత మాత్రమేనన్నారు.

జగన్ కీలక ప్రసంగం
రాష్ట్ర ఆర్ధిక నిర్వహణ అనేది చాలా పెద్ద సవాలని సీఎం జగన్ ఇవాళ అన్నారు. కేంద్రంతో పోలిస్తే ఏపీ చేసిన అప్పు గణనీయంగా తగ్గిందని అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో తెలిపారు. కేంద్రం కంటే మెరుగ్గానే ఏపీ ఆర్ధిక వ్యవస్థ ఉందన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని పరిస్థితులు మెరుగ్గా లేవని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. రాష్ట్రం బాగున్నా శ్రీలంక తరహాలో పరిస్థితులు ఉన్నాయని కొందరు లేనిది సృష్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. కోవిడ్ ఉన్నా ఏపీ స్థూల ఉత్పత్తి గణనీయంగానే పెరిగిందన్నారు. 2021-22లో 11.43 శాతం జీఎస్డీపీ పెరుగుదలతో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. గడచిన మూడేళ్లలో సగటున 5 శాతం పెరిగిందన్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఇదే..
ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో తలసరి ఆదాయ వృద్ధి కనిపిస్తే మిగతా రాష్ట్రాల్లో తిరోగమనంలో ఉన్నాయని జగన్ గుర్తుచేశారు. కొనుగోలు శక్తి పడిపోకుండా అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా లాంటి పథకాలు పనికి వస్తున్నాయన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మూల ధన వ్యయం చేస్తున్నామని, అసాధారణ స్థాయిలో అప్పులు చేస్తున్నారని విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇందులో నిజం ఎంతుందో ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. గతంలో రుణాల పెరుగుదల సాలీనా 17.4 శాతం ఉంటే ప్రస్తుతం 12.7 శాతం మాత్రమే పెరుగుదల ఉందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 3,82,165 కోట్లు మాత్రమే రుణాలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ గ్యారెంటీల తో కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు 1,17,730 కోట్లు మొత్తం అప్పు 4,99,895 కోట్లకు చేరాయని,
మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 52.07 శాతం మాత్రమేనన్నారు.

కేంద్రంతో పోల్చినా ఏపీ బెటర్
జీడీపీలో రుణ శాతం దేశ సగటుతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని జగన్ గుర్తుచేశారు. కేంద్ర రుణాలు- రాష్ట్ర రుణాలూ పెరిగిన తీరును చూసినా ఏపీ పనితీరు అవగతం అవుతుందన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి రాష్ట్ర రుణం 1.20 లక్షల కోట్లు ఉంటే చంద్రబాబు హయాంలో 2,69,462 కోట్లకు పెరిగాయన్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వంలో 123.53 శాతం మేర రుణాలు పెరిగాయని జగన్ విశ్లేషించారు. 2019 మే 31 తేదీనాటికి ఉన్న ఏపీకి ఉన్న అప్పులు 2,69,462 కోట్లు అయితే.. మూడేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 మార్చి 31 నాటికి ఉన్న రుణం 3,82,165 కోట్లు మాత్రమే అని జగన్ తెలిపారు. కోవిడ్ లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నా ఏపీ గణనీయంగా వృద్ధి సాధించిందని గుర్తుచేశారు.

అప్పులపై దుష్ప్రచారం
భారీగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందనే దుష్ప్రచారం కూడా చేస్తున్నారని విపక్షాలపై జగన్ మండిపడ్డారు. రుణాలకు వడ్డీల కింద 21,499 కోట్లు, రుణంగా 14,558 కోట్లు చెల్లించామన్నారు. అలాగే రాష్ట్ర రెవెన్యూ 2021-22 ఆర్ధిక సంవత్సరానికి 75,696 కోట్లు వచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధి రేటు పరుగులు పెడుతోందని, రాష్ట్ర రెవెన్యూ కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసే సమయానికి గత ప్రభుత్వం కంటె మెరుగైన పనితీరు కనపరుస్తామని జోస్యంచెప్పారు. మూలధన వ్యయం గురించిన దుష్ప్రచారం కూడా చేస్తున్నారని ఆక్షేపించారు. సంక్షేమ పథకాలు, ప్రజాకర్షకర పథకాల పైనే డబ్బులు వ్యయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా అవాస్తవమన్నారు. మూడేళ్లలో మూలధన వ్యయంగా భారీ మొత్తాన్నే ఖర్చు చేశామన్నారు.
విద్య, వైద్యం, నాడు-నేడు కార్యక్రమాలు, వ్యవసాయ రంగాలకు ఈ వ్యయం చేశామన్నారు. మూల ధన వ్యయం కింద 2014- 19 వరకూ 76,139 కోట్లు వ్యయం చేస్తే, గడచిన మూడేళ్లలోనే తమ ప్రభుత్వం 55,086 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. 15 ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం పన్నుల ఆదాయాన్ని పంచడం లేదని, ఏపీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం 32 శాతం మాత్రమే పన్నుల ఆదాయాన్ని కేంద్రం ఇచ్చిందని జగన్ తెలిపారు.

దుష్ప్రచారాల్ని ప్రజలు నమ్మొద్దు
పాలనలో తెచ్చిన సంస్కరణలు, డీబీటీ లాంటి విధానాలు, సుపరిపాలన, ఆర్ధిక క్రమశిక్షణ వల్ల పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నాని జగన్ తెలిపారు. ఇంత చేస్తున్నా ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటితో పోలిస్తే గతంలో కూడా ఇంతే బడ్జెట్ ఉన్నా చంద్రబాబు హయాంలో అమ్మ ఒడి పథకం లేదు, రైతు భరోసా లేదు, చేయూత ఎందుకు లేదో ఆయన చెప్పాలన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని జగన్ కోరారు. ఆర్ధిక పరిస్ధితిపై ఇవాళ చర్చ ముగియడంతో సోమవారం పరిశ్రమలపై చర్చ చేపడదామని జగన్ తెలిపారు.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications