ఢిల్లీని కొట్టి మరో కోట: సోనియాపై జగన్, హైద్రాబాద్ పైనా
చిత్తూరు: ఢిల్లీ కోటను బద్దలు కొట్టి మనమే మరో కోటను నిర్మిద్దామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. చిత్తూరు జిల్లాలో జగన్ సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా తిరుపతిలోని శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్లో జగన్ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదు మనందరిదీ అన్నారు. హైదరాబాదు కోసం మనమంతా కొట్టుకోవాలా, నీటి కోసం అన్నదమ్ములు గొడవ పెట్టుకోవాలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులు గొప్ప డ్రామా ఆర్టిస్టులు అని విమర్శించారు.

విభజనకు వ్యతిరేకం అంటూ వారి పైపై డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్లు, కొడుకు ప్రధాని పదవి కోసమే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని విమర్శించారు. తన కొడుకు కోసం మన పిల్లల ఉద్యోగాలను బలి చేస్తున్నారన్నారు.
కేసుల భయంతో చంద్రబాబు విభజన విషయంలో కాంగ్రెసు పార్టీకి వంత పాడుతున్నారన్నారు. నేటి రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. తెలుగు రాని వారు తెలుగువారిని చీల్చుతున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు, కిరణ్‌లు సమైక్యం అంటున్న జనాలు వారి వెంట ఎందుకు నడవడం లేదో చెప్పాలన్నారు. వారిది సమైక్యంపై పైపై ప్రేమే అన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే కష్టాలు తప్పడం లేదని, ఇక విడిపోతే శ్రీకాకుళం నుండి కుప్పం దాకా సమస్యలు అన్నారు.












Click it and Unblock the Notifications