భయం.. భయంగానే చంద్రబాబు సర్కార్: ఎక్కడ గుట్ట రట్టవుతుందో..
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న దాడులు, హత్యలు, అత్యాచారాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఘాటు విమర్శలు సంధించారు.
50 రోజుల్లోనే..
అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే టీడీపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని వ్యాఖ్యానించారు.

పూర్తిస్థాయి బడ్జెట్ ఏదీ..?
చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం ఎంతగా భయపడుతోందంటే ఈ ఏడాది కాలానికి అవసరమైన పూర్తిస్థాయి బడ్టెట్‌ను కూడా ప్రవేశపెట్టలేక పోతోందని జగన్ పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఏడాదిలో ఏడు నెలలు ఓట్ ఆన్ అకౌంట్ మీదే నడుస్తోందంటే ప్రభుత్వం ఎంతగా భయపడుతోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
మభ్యపెట్టే హామీలు..
ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయలేని స్థితి తలెత్తిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని జగన్ చెప్పారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేమనే గుట్టురట్టవుతుందని భయపడుతోందని పేర్కొన్నారు.
ప్రజలు ప్రశ్నిస్తారు?
ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు, అమలు చేయని పరిస్థితిలో.. ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయం.. కూటమి ప్రభుత్వంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని జగన్ పేర్కొన్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేలా రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారంటూ ఆరోపించారు.
ఎవరూ ప్రశ్నించకూడదా?
రాష్ట్రంలో హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదనే పరిస్థితిని సృష్టిస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రశ్నించే వారిని మరింత భయాందోళనలకు గురి చేసేలా చంద్రబాబు తన పరిపాలన సాగిస్తోన్నారంటూ ధ్వజమెత్తారు.
ప్రతిపక్షంగా గుర్తించాలి..
ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయని, ఒకటి అధికార పక్షం.. మరొకటి ప్రతిపక్షం అని జగన్ గుర్తు చేశారు. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉందని, తమను ప్రతిపక్షంగా గుర్తించాలని, ఆ పార్టీ నాయకుడినే, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాల్సి ఉంటుందని జగన్ అన్నారు. ఆ పని చేస్తే.. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారనే భయం చంద్రబాబులో ఉందని పేర్కొన్నారు.

మైక్ ఇవ్వాలన్నా భయమే..
ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్ ఇవ్వాల్సి ఉంటుందని, అలా చేస్తే, ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయం ఉందని జగన్ ఎద్దేవా చేశారు.
ఇన్ని భయాలతో పాలన..
ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా, చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడని, అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా, ఆయన పాపాలు కూడా పండే రోజు దగ్గర్లోనే ఉందని జగన్ తేల్చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని.. 24వ తేదీన ఎండగట్టనున్నామని అన్నారు.
ఫొటో గ్యాలరీ..
ఢిల్లీ ఆందోళన సందర్భంగా ఫొటో గ్యాలరీని సైతం ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు. ఢిల్లీలో నిరసన తెలియజేయడం ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి రాష్ట్రంలో నెలకొన్న భయానక పాలనను తీసుకువెళ్తామని, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నామని అన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications