చంద్రబాబు దూకుడు- సేఫ్ ప్లాన్ వెతుక్కుంటున్న జగన్ ? సంక్షేమం వెనక్కి ! రాజధానులకే ఓటు
ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. అంతే కాదు ఎన్నికల అజెండాలు కూడా ఇప్పుడే డిసైడ్ అయిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ మూడేళ్లుగా భారీ ఎత్తున సంక్షేమంతో ముందుకెళ్తున్న జగన్ ఎన్నికలకు కూడా ఇదే అజెండాతో వెళ్తారని అంతా భావించారు. కానీ మారుతున్న పరిస్ధితుల్లో అదంత సులువు కాదని తెలుస్తోంది. దీంతో జగన్ సైతం సంక్షేమానికి బదులుగా రాజధానుల అజెండానే తెరపైకి తెస్తున్నట్లు అర్ధమవుతోంది.

2024 ఎన్నికల అజెండా
2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అజెండాలు ఇప్పుడే సిద్దమవుతున్నాయి. గతంలో 2019 ఎన్నికల సమయంలో విభజన హామీల్ని కేంద్రంతో అమలుచేయించడంలో చంద్రబాబు వైఫల్యంతో విపక్ష నేతగా ఉన్న జగన్ ను నమ్మి జనం ఓటేశారు. అయితే ఈ మూడేళ్లలో జగన్ కూడా దొందూదొందే అన్నట్లుగా మారిపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తో పాటు చంద్రబాబు కూడా కొత్త అజెండాలు వెతుక్కోవాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. దీంతో చంద్రబాబు తన మానసపుత్రిక అమరావతి రాజధాని స్ధానంలో వైసీపీ తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని టార్గెట్ చేసే పనిలో పడ్డారు. తద్వారా అమరావతి రాజధాని అజెండాతో ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. దీంతో జగన్ కూడా రూటు మార్చేస్తున్నారు.

చంద్రబాబు అమరావతి అజెండా
2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు విభజన హామీల అమలు అజెండాతో వెళ్లే పరిస్ధితి లేకపోవడంతో చంద్రబాబుకు కొత్త అజెండా అవసరం ఏర్పడింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో భారీ ఎత్తున అమలవుతున్న సంక్షేమం కారణంగా ఈ విషయంలో కొత్తగా హామీలు ఇచ్చే పరిస్ధితి కూడా లేదు. దీంతో తనకు గతంలో కాస్తో కూస్తో పేరు తెచ్చిన అమరావతి రాజధాని అంశాన్నే అజెండాగా మార్చే పనిలో చంద్రబాబు బిజీగా కనిపిస్తున్నారు. అమరావతి రైతులతో కలిసి ఏకైక రాజధాని మంత్రాన్ని జపిస్తున్నారు. దీనికి కేంద్రంలో బీజేపీ మద్దతు కూడా లభిస్తుండటంతో వైసీపీపై తన దాడి సులువవుతుందనే భావనలో చంద్రబాబు కనిపిస్తున్నారు.

జగన్ సంక్షేమ అజెండా
2019 ఎన్నికల్లో విభజన హామీల అమలు అజెండాతో అధికారం దక్కించుకున్న జగన్ అందులో విఫలమయ్యారు. దీంతో ఆయన కూడా కొత్త అజెండా వెతుక్కోవాల్సిన పరిస్ధితి. దీంతో మొదట్లో సంక్షేమ అజెండాతోనే ఎన్నికలకు వెళ్లాలని భావించారు. కానీ పరిస్ధితులు అందుకు పూర్తిగా అనుకూలించడం లేదు. అప్పులతో అమలుచేస్తున్న సంక్షేమంలో లోటుపాట్లు పెరిగిపోతున్నాయి. దీంతో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తున్న వైసీపీ నేతలకు ప్రశ్నలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో సంక్షేమాన్ని అజెండాగా మార్చుకుని ఎన్నికలకు వెళితే అధికారం గ్యారంటీ కాదని జగన్ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. దీంతో జగన్ కూడా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోక తప్పని పరిస్దితి.

సంక్షేమం కంటే రాజధానులే బెటర్ ?
రాష్ట్రంలో మూడేళ్లుగా సంక్షేమ అజెండాను వైసీపీ సర్కార్ భారీ ఎత్తున అమలుచేస్తోంది. ఇందుకోసం భారీగా అప్పులు కూడా చేస్తోంది. అయినా అక్కడక్కడా లోటుపాట్లు తప్పడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంక్షేమాన్ని నమ్ముకుని వెళ్లేందుకు జగన్ కూడా సాహసించలేని పరిస్ధితి. అదే సమయంలో చంద్రబాబు తన పరివారంతో అమరావతి రాజధానిపై బలంగా పోరాడేందుకు సిద్దమవుతున్నారు. దీంతో జగన్ కూడా కౌంటర్ గా మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. అప్పుడే చంద్రబాబుపై పైచేయి సాధించడం సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications