హోదా కోసం జగన్ పోరు: మోడీని అన్నట్లా, అననట్లా?
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు పోరాటం ప్రారంభించారు. అయితే, ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. కానీ, ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు కనిపించారు.
కానీ, ఆ వ్యాఖ్యలు అంతగా ఘాటుగా అనిపించలేదు. ప్రత్యేక హోదా ఉండి తక్కువ జనాభా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్టారనికి నరేంద్ర మోడీ 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారని, ప్రత్యేక హోదా ఇస్తే అదే ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాల్సి వస్తుందో ఆలోచించాలని ఆయన అన్నారు.

ఎపికి ప్రత్యేక హోదా ఐదేళ్ల పాటు ఇస్తామని అప్పటి యుపిఎ ప్రభుత్వం అంటే, పదేళ్లు కావాలని బిజెపి, టిడిపి సభ్యులు పట్టుబట్టి ప్రకటన చేయించారని, ఆ పార్టీలే ఇప్పుడు అధికారంలో ఉన్నాయని, పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగినవారు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు పట్టుబట్టడం లేదని ఆయన అన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గం ఎపికి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని ప్రణాళికా సంఘానికి పంపించిందని, ప్రణాళికా సంఘాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసి నీతి అయోగ్‌ను ఏర్పాటు చేశారని, నీతి ఆయోగ్ ఏర్పడడానికి ముందు ఎనిమిది నెలలు ప్రణాళికా సంఘం ఉనికిలో ఉందని, ఆ కాలంలో ప్రత్యేక హోదాను సాధించడానికి మోడీ ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి పెట్టలేదని ఆయన అన్నారు.
కాగా, ఎన్నికల ప్రచారంలో ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడిని పక్కన పెట్టుకుని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని అమలు చేయడం లేదని, ఆ హామీని అమలు చేయించడానికి చంద్రబాబు ఎందుకు ప్రయత్నం చేయడం లేదని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేని చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా వేస్ట్ అని అంటున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తే తానే సాధించానని చెప్పుకుంటారని జగన్ అన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వంపై గానీ, నరేంద్ర మోడీపై గానీ ఆయన పెద్దగా విరుచుకుపడినట్లు కనిపించలేదు.












Click it and Unblock the Notifications