మరో టీడీపీ ఎమ్మెల్సీ గెలవనీయొద్దు ! జగన్ కీలక అడుగులు- ఎమ్మెల్యేల కట్టడికి వ్యూహాలు..?
ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయాలు ఇప్పుడు వైఎస్ జగన్ ను ఆలోచనలో పడేస్తున్నాయి.
అమరావతి : ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఓ కుదుపుకు కారణమయ్యాయి. ఇప్పటివరకూ వైసీపీకి తిరుగులేదని భావిస్తున్నతరుణంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఆ భ్రమల్ని పటాపంచలు చేసేశాయి. దీంతో మరో మూడు రోజుల్లో జరిగే ఎమ్మెల్యేకోటా ఎన్నికల్ని గెలిచేందుకు వైఎస్ జగన్ సర్వశక్తులొడ్డుతున్నారు. అసెంబ్లీతో పాటు బయటా ఎమ్మెల్యేల కట్టడికి ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోరు
పట్టభద్రులు, టీచర్లు, స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తికావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఎమ్మెల్యేల కోటా ఎన్నికలపైనే నెలకొంది. వాస్తవానికి అసెంబ్లీలో ఉన్న బలాబలాల్ని చూస్తే వైసీపీ ఆరు ఎమ్మెల్సీ సీట్లు సునాయాసంగా గెల్చుకోవడం ఖాయం. అయితే ఆరు సీట్లకు సరిపడా ఎమ్మెల్యేల తర్వాత తమ క్యాంపులో మిగిలిన ఇతర ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి తమకు మద్దతిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు, ఓ జనసేన ఎమ్మెల్యే ఓట్లు తమకు పడతాయని ఊహించి వైసీపీ ఏడో అభ్యర్ధిని కూడా నిలబెట్టింది. దీంతో ఈ అభ్యర్ధి గెలుపు విషయంలో వైసీపీపీ ఒత్తిడి పెరుగుతోంది. దీనికి కారణం వైసీపీ క్యాంపులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి టీడీపీకి ఓటు వేసే అవకాశం ఉండటం, అలాగే టీడీపీ నలుగురు ఎమ్మెల్యేలు విప్ భయంతో ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశాలుండటం దీనికి కారణం.

ఎమ్మెల్యేల కట్టడికి వైసీపీ వ్యూహాలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలను ఇప్పుడు పూర్తి స్ధాయిలో కట్టడి చేయాల్సిన పరిస్ధితి అధికార పార్టీకి ఎదురవుతోంది. టీడీపీకి గెలిస్తే ఓ అదనపు స్ధానం, ఓడితే ఇబ్బంది లేని పరిస్దితి ఎదురవుతుండగా.. వైసీపీకి తాము నిలబెట్టిన ఏడో అభ్యర్ధిని కచ్చితంగా గెలిపించుకోవాల్సిన స్ధితి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల్ని కట్టడి చేసేందుకు జగన్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీతో పాటు బయట కూడా ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు అధికార పార్టీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఈ వ్యూహాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.

అసెంబ్లీలో మాక్ పోలింగ్
పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేల కొద్దీ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఓటింగ్ విషయంలో అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు అదే అంశం ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లోనూ వైసీపీని కలవరపెడుతోంది. దీంతో తమ ఎమ్మెల్యేలకు ఇవాళ అసెంబ్లీలో మాక్ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఉదయం 10.30 కి అసెంబ్లీ కమిటీ హాల్లో వైసీపీ ఎమ్మెల్యే లకు MLC ఎన్నికలపై మాక్ పోలింగ్ జరుగుతోంది. దీనికి మొత్తం ఎమ్మెల్యేలు తప్పక హాజరుకావాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఒక్క ఓటు కూడా నష్టపోకుండా ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రతీ 22 మంది ఎమ్మెల్యేలకు ఒక టీం లీడర్ నియమించారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై విప్ కూడా జారీ చేశారు. మంత్రులకు సైతం సీఎం జగన్ అన్ని స్ధానాలు గెల్చుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యేలపై నిఘా ?
తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలపై నిఘా కూడా పెరిగింది. అసెంబ్లీకి వస్తున్న ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, అనుచరులపై నిఘా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంటిలిజెన్స్ అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరిని కలుస్తున్నారు, వైసీపీకి కాకుండా టీడీపీకి ఓటు వేసే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా, ఉంటే వారిని ఎలా దారికి తెచ్చుకోవాలన్న అంశాలపై అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు 23న జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications