మోపిదేవికి అంత చేసినా... జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
కష్టాలెప్పుడూ శాశ్వతంగా ఉండవని, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుందని, ఇది సృష్టి సహజమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ రేపల్లె పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని, విలువలు, విశ్వసనీయతే తమకు శ్రీరామ రక్ష అని జగన్ తెలిపారు. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిస్తుందని గుర్తుచేశారు. రేపల్లెకు చెందిన పార్టీ నేత మోపిదేవి టీడీపీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోపిదేవి వెంకట రమణ పార్టీని వీడి వెళ్లిపోవడం బాధాకరమని జగన్ తెలిపారు. మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదని తెలిపారు. ఏరోజైనా మోపిదేవి వెంకటరమణకి మంచే చేశామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిపదవి ఇచ్చామని గుర్తుచేసుకున్నారు. మండలిని రద్దుచేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పదవిపోకుండా అడిగిన వెంటనే రాజ్యసభకు పంపామన్నారు. ఒక మత్స్యకారుడికి తొలిసారిగా రాజ్యసభ ఇచ్చిన ఘనత తమ పార్టీదన్నారు.

తమకు కష్టాలు కొత్తేమీ కాదని, రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని రేపల్లె నేతలకు జగన్ తెలిపారు. మా నాన్న ముఖ్యమంత్రి, అయినా కష్టాలు వచ్చాయి, పెద్దవాళ్లంతా ఏకమయ్యారు, తప్పుడు కేసులు పెట్టారు, 16 నెలలు జైల్లో పెట్టారు, వేధించారంటూ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించలేదా అని ప్రశ్నించారు.
మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడన్నారు.












Click it and Unblock the Notifications