కూటమి మ్యానిఫెస్టోపై జగన్ రియాక్షన్ ఇదే..! మోడీ ఫొటో మిస్సింగ్ వెనుక..?
ఏపీలో విపక్ష ఎన్డీయే కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో ఇవాళ విడుదల చేసింది. అయితే అనుకున్న సమయం కంటే దాదాపు 3 గంటలు ఆలస్యంగా ఇది విడుదలైంది. ఈ కార్యక్రమంలో విపక్ష కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మ్యానిఫెస్టో పట్టుకుంటే అక్కడే ఉన్న బీజేపీ జాతీయ నేత సిద్ధార్ధ్ నాథ్ సింగ్ అక్కడికి వచ్చినా దూరంగా ఉండిపోయారు. అంతే కాదు ప్రధాని మోడీ ఫొటో కూడా మ్యానిఫెస్టోపై కనిపించలేదు.
ఈ నేపథ్యంలో ఎన్డీయే మ్యానిఫెస్టో విడుదలపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే ప్రధాని మోడీ ఫొటో ఎన్డీయే మ్యానిఫెస్టోపై లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు-పవన్ మ్యానిఫెస్టోపై మోడీ ఫొటో పెట్టొద్దంటూ బీజేపీ అధిష్టానం చంద్రబాబుకు ఫోన్ చేసిందని జగన్ తెలిపారు. దీంతో చంద్రబాబు మ్యానిఫెస్టో అంతా మోసమని తేలిపోయిందన్నారు. అలాంటి మ్యానిఫెస్టోపై మోడీ ఫొటో వేసేందుకు బీజేపీ అంగీకరించలేదన్నారు.

ఎన్డీయే కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ క్షేత్రస్ధాయిలో ఉమ్మడి ప్రచారంలో కాషాయ నేతలు కనిపించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రధాని మోడీ కేవలం ఒక్కసారి మాత్రమే ఏపీలో ప్రచారానికి వచ్చి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ప్రచారంలో కనిపించడం లేదు. దీంతో బీజేపీ అభ్యర్ధులతో కలిసి చంద్రబాబు, పవనే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మ్యానిఫెస్టో కూటమిలో మరో చిచ్చు రేపినట్లయింది.












Click it and Unblock the Notifications