రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-ఆ మొత్తాలు ముందే వారి ఖాతాల్లో జమ..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై విపక్షాలు రకరకాల ప్రచారాల్ని జనంలోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా రైతులకు సంబంధించిన పథకాలపై వారిలో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించిన ఓ కీలక పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఎలాంటి ఆందోళనా అవసరం లేదని తేల్చిచెప్పేసింది.
ఏపీలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పురుడుపోసుకున్న రైతులకు ఉచిత విద్యుత్ పథకం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ పథకంలో కొన్ని మార్పులు చేసి రైతులకు అందించాలని వైసీపీ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. కేంద్రం నిర్దేశించిన విధంగా రైతులు వాడుతున్న వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై రైతుల్లో అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో విపక్షాలు కూడా విమర్శలు మొదలుపెట్టడంతో అవి మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

రైతులు వాడుతున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఇచ్చే కరెంటుకు స్మార్ట్ మీటర్ల బిగింపు ద్వారా విధించే ఛార్జీలను రైతులకు ముందుగానే చెల్లించనున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి ఇస్తున్న విద్యుత్ కొనసాగుతుందని, స్మార్ట్ మీటర్ల బిగింపు ద్వారా ఈ పథకానికి చరమగీతం పాడతారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

అలాగే రాష్ట్రంలో రైతులకు ఇస్తున్న వివిధ రాయితీలు కూడా కొనసాగుతాయని విజయానంద్ తెలిపారు. విద్యుత్ రంగానికి ఇస్తున్న రాయితీల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ మేరకు స్మార్ట్ మీటర్ల బిగింపు తర్వాత వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆయన ఈ ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications