YS Jagan : రేషన్లు, పెన్షన్లు, ఇతర పథకాలపై జగన్ మరో గుడ్ న్యూస్...
ఏపీలో భారీ ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్న వైఎస్ జగన్ సర్కార్ ఇవాళ మరికొందరు లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారితో పాటు ఏదైనా కారణంతో గతంలో పథకాలు తొలగించిన అర్హులైన లబ్దిదారులకు పథకాల లబ్దిని అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా గత ఎనిమిది నెలల కాలంలో వివిధ పథకాల లబ్దిని కోల్పోయిన అర్హులైన లబ్ది దారులకు సీఎం జగన్ ఇవాళ నిధులు విడుదల చేశారు.
గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూలై నెల వరకూ అంటే ఎనిమిది నెలల పాటు పెన్షన్లతో పాటు వివిధ పథకాల కింద రావాల్సిన మొత్తాలు అర్హులై ఉండి కూడా ఏదైనా కారణంతో కోల్పోయిన వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం.. ఇవాళ వాటికి నిధులు విడుదల చేసింది. సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఈ నిధులు రూ.216.34 కోట్లను సదరు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.

మరోవైపు రాష్ట్రంలో ఇలా వివిధ పథకాల లబ్దిని కోల్పోయి ఆ తర్వాత అర్హత సాధించిన 1.49 లక్షల మందికి పెన్షన్లు, 4327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2 లక్షల మందికి రేషన్ కార్డులు, 12 వేల మందికి ఇళ్ల పట్టాలను సీఎం జగన్ అందించారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కులం,మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వీటిలోనూ ఏదైనా కారణంతో అందని వారిని కూడా ఎంపిక చేసి వాటిని అందజేస్తున్నట్లు జగన్ తెలిపారు.
దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో వెయ్యి రూపాయలుగా ఉన్న పెన్షన్ కాస్తా వైసీపీ ప్రభుత్వంలో రూ.2750కి పెంచామన్నారు. ప్రతీ ఇంటికీ మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం తమదని, వారికి మంచిచేసే బాధ్యత తనదేనని సీఎం జగన్ తెలిపారు. దాన్ని నిలబెట్టుకుంటూ ఇవాళ అర్హులై పథకాలు అందుకోని వారికి లబ్ది చేకూర్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. అనంతరం సదరు పథకాలు అందుకున్న లబ్దిదారులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications