మళ్లీ జనంలోకి జగన్- కేసరపల్లి నుంచి బస్సుయాత్ర-సాయంత్రం గుడివాడలో సభ..!
ఏపీలో మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్ పై విజయవాడలో జరిగిన రాయి దాడి తర్వాత తిరిగి ఇవాళ యాత్ర ప్రారంభించారు. విజయవాడలో రాయి దాడి తర్వాత గన్నవరం సమీపంలోని కేసరపల్లి హాల్ట్ సైట్ లోనే ఉండి విశ్రాంతి తీసుకున్న జగన్... కొద్ది సేపటి క్రితం యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ కీలక నేతలు ఆయనను వచ్చి కలిశారు. ఆయన గాయం తాజా పరిస్దితిని అడిగి తెలుసుకున్నారు.
కేసరపల్లిలోని నైట్ హాల్ట్ సైట్ నుంచి ఇవాళ ఉదయం బయలుదేరే సమయంలో నుదుటికి తగిలిన గాయానికి ప్లాస్టర్ వేసుకుని జగన్ కనిపించారు. దీంతో నేతలు ఆయన్ను పరామర్శించడం కనిపించింది. అనంతరం పటిష్ట భద్రత మధ్య ఆయన కేసరపల్లి సైట్ నుంచి గుడివాడ వైపుకు బస్సులో బయలుదేరారు. తాజా దాడి నేపథ్యంలో జగన్ బస్సు యాత్రకు భద్రత భారీగా పెంచారు. అలాగే పలు ఆంక్షలు కూడా విధించారు.

జగన్ బస్సు యాత్రకు మూడంచెల భద్రత కల్పించిన పోలీసులు అనుమానితుల్ని బస్సు వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. అలాగే భారీ గజమాలలు తీసుకురావొద్దని చెప్పేశారు. అలాగే పూలు విసిరే వాళ్లపై కూడా నిఘా పెట్టారు. దీంతో బస్సు యాత్ర ఇప్పటివరకూ ఓ ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తుగా మారబోతోంది.

అలాగే దాడి తర్వాత ఇప్పటివరకూ ఒక్క మాట కూడా మాట్లాడని జగన్.. ఇవాళ సాయంత్రం గుడివాడలో ఏర్పాటు చేస్తున్న సభలో స్పందించబోతున్నారు. దీంతో గుడివాడలో జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications