Ys Jagan: లండన్ నుంచి తిరిగొచ్చిన జగన్ - తెలుగు ప్రజలకు దీపావళి విషెస్..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ లండన్ టూర్ నుంచి తిరిగి వచ్చారు. ఈ నెల 11వ తేదీన పెదద కుమార్తెను చూసేందుకు కుటుంబంతో సహా లండన్ బయలుదేరి వెళ్లిన జగన్.. ఇవాళ ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు నుంచి రేపు తాడేపల్లికి జగన్ రానున్నారు. దాదాపు 10 రోజుల పర్యటన తర్వాత జగన్ తిరిగి పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రానున్నారు.
మరోవైపు తెలుగు ప్రజలకు జగన్ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఆనందాలు వెల్లువలా పొంగాలి'. అంటూ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని జగన్ ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ అని వైయస్ జగన్ అన్నారు. ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలన్నారు. దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని జగన్ ఆకాంక్షించారు.

మరోవైపు జగన్ 10 రోజుల పాటు అందుబాటులో లేకున్నా పార్టీ శ్రేణులు మాత్రం ఎప్పుడూ లేని విధంగా చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. గతంలో జగన్ వస్తేనే, అందుబాటులో ఉంటేనే వైసీపీ శ్రేణులు యాక్టివ్ గా ఉంటాయనే విమర్శ ఉండేది. దీన్ని ఈసారి జగన్ తో పాటు పార్టీ శ్రేణులు అధిగమించారు. దీంతో ఈ సానుకూల పరిణామంపై ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications