జగన్ కేబినెట్ మంత్రికి బ్రెయిన్ స్ట్రోక్-హైదరాబాద్ ఆస్పత్రికి తరలింపు
ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ తాజాగా అస్వస్ధతకు గురయ్యారు. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో ఆయన ఉన్నట్లుండి కుప్పకూలారు. దీంతో విశ్వరూప్ ను తొలుత అమలాపురం ఆస్పత్రికి, ఆ తర్వాత రాజమండ్రి.. చివరికి హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
జగన్ కేబినెట్లో కొత్తగా ఏర్పడిన అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి విశ్వరూప్.. ఆయన తొలి కేబినెట్లోనూ మంత్రిగా పనిచేశారు. జిల్లాల్లో చురుగ్గా ఉంటూ వైసీపీ గడప గడప కార్యక్రమంలో కూడా విశ్వరూప్ పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో వైఎస్సార్ వర్ధంతి రావడంతో అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అయితే హఠాత్తుగా అనారోగ్యం పాలైన ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

విశ్వరూప్‌కు వైద్యం అందించిన డాక్టర్లు... ఆయన స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లుగా తేల్చారు. రాజమండ్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని ఆయనకు వైద్యులు సూచించారు. దీంతో శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి విశ్వరూప్‌ను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం విశ్వరూప్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు, ఊపిరిపీల్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications