ఏపీ పెగాసస్-చంద్రబాబు మళ్లీ సేఫ్ !వైసీపీ వైఫల్యంతో మమత బాంబు తుస్సు ?ఏబీ మాత్రమే బలి
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్ధి పార్టీ వైసీపీ, దాని అధినేత వైఎస్ జగన్ పై నిఘా కోసం పెగాసస్ స్పైవేర్ ను చంద్రబాబు కొన్నారంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. అసందర్భంగా ఆమె చేసిన ఆరోపణల్ని వైసీపీ ఓ రేంజ్ లో క్యాష్ చేసుకుంటుందని అంతా భావించారు. కానీ వైసీపీ మాత్రం ఇక్కడ పూర్తిగా విఫలమైంది. అప్పటికే దాదాపు ఇవే ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్న ఏపీ సర్కార్.. చంద్రబాబు పెగాసస్ వివాదంతో దాన్ని లింక్ చేసుకోలేకపోవడమే ఇందుకు కారణం.

ఏపీలో పెగాసస్ దుమారం
ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా.. అప్పటి సీఎం చంద్రబాబు ప్రత్యర్ధులపై నిఘా కోసం ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్ ను కొన్నారంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబు పేల్చారు. దీంతో టీడీపీ ఇరుకునపడింది. అయితే తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి దీన్నుంచి త్వరగానే బయటపడిపోయింది. అయితే టీడీపీ ఇక్కడ బయటపడటానికి వైసీపీ అనుభవరాహిత్యమే కారణంగా నిలవడం ఏపీలో రాజకీయ పరిస్ధితికి అద్దం పట్టేలా ఉంది. అసలు ఈ ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ వాటిపై మరో మాట మాట్లాడకపోవడం కూడా వైసీపీకి మైనస్ అయింది.

టీడీపీ మార్క్ ఎదురుదాడి
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉండగా పెగాసస్ కొన్నారంటూ మమతా బెనర్జీ ఆరోపణలు చేయగానే రంగంలోకి దిగిన టీడీపీ వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టింది. మమత తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పకుండా.. ఆమెకు తప్పుడు సమాచారం అందడం వల్లే అలా చెప్పారంటూ నారా లోకేష్ ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లయింది. అదే సమయంలో తమ దగ్గర పెగాసస్ ఉండుంటే జగన్ అధికారంలోకి వచ్చేవారా ? జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యే వారా అంటూ ఎదురుప్రశ్నలు వేసింది. అంతే కాదు గౌతం సవాంగ్ టీడీపీ హయాంలో పెగాసస్ కొనలేదంటూ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు గతంలో ఇచ్చిన సమాధానాన్ని సైతం టీడీపీ బయటపెట్టింది. దీంతో పెగాసస్ ఆరోపణలకు టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది.

అవకాశం జారవిడుచుకున్న వైసీపీ
చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్ వేర్ కొన్నారంటూ మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్ని వైసీపీ అందిపుచ్చుకోలేకపోయింది.
అంబటి రాంబాబు వంటి వారితో ప్రెస్ మీట్లు పెట్టించి చేతులు దులిపేసుకుంది. సొంత పత్రిక సాక్షిలో సైతం చంద్రబాబును కార్నర్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. చిన్నా చితకా విషయాలకే ప్రెస్ మీట్లు పెట్టే వైసీపీ పెద్దలెవరూ చంద్రబాబును పెగాసస్ విషయంలో కార్నర్ చేసేందుకు ముందుకు రాలేదు. జగన్ అయితే పూర్తిగా మౌనంగా ఉండిపోయారు. దీంతో చంద్రబాబుపై మమత చేసిన పెగాసస్ ఆరోపణలు తేలిపోయాయి.

ఏబీ వెంకటేశ్వరరావు బలి
మమతా బెనర్జీ చంద్రబాబుపై చేసిన ఆరోపణలు తేలిపోతున్న సమయంలోనే కేంద్రం గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిఘా పరికరాలు కొన్న ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ కు గురైన మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు షాకిచ్చింది. ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ కు ఆమోదం తెలిపింది. తదుపరి చర్యల్లో భాగంగా ఆయనపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. అప్పుడైనా వైసీపీ స్పందించలేదు. చంద్రబాబు పెగాసస్ కొన్నారా లేదా అనే దానిపై సమాచారం లేకపోయినా ఏబీపై తమ ఆరోపణలకు స్పందించి సస్పెన్షన్ కు కేంద్రం ఆమోదం తెలిపిన వ్యవహారంపైనా వైసీపీ నుంచి సరైన స్పందన లేకుండాపోయింది. దీంతో ఈ వ్యవహారం టీడీపీకి ఊరటనిచ్చింది.

చంద్రబాబు మళ్లీ సేఫ్ !
మమతా బెనర్జీ చేసిన పెగాసస్ ఆరోపణల్లో చంద్రబాబు చిక్కుకున్నారని వైసీపీతో పాటు ఆయన ప్రత్యర్ధులు సంబరపడేలోపే టీడీపీ ఎదురుదాడి మొదలుపెట్టడంతోపాటు ఈ ఆరోపణలు నిజం కావని చెప్పేలా ఆధారాలు కూడా విడుదల చేసింది. దీంతో వైసీపీకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోవడం ఒక్కటే మిగిలింది. ఎప్పటిలాగే చంద్రబాబు ఈ వ్యవహారంలోనూ సేఫ్ గా మిగిలిపోయారు. గతంలో ఓటుకు నోటు కేసులోనూ ఇదే తరహాలో కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ ఎదురుదాడి మొదలుపెట్టిన చంద్రబాబు.. అప్పట్లో దాన్నుంచి సేఫ్ గా బయటపడ్డారు. ఇప్పుడు కూడా ఎదురుదాడి మంత్రమే చంద్రబాబును పెగాసస్ ఆరోపణల నుంచి బయటపడేసినట్లు చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications