కేసులతో కష్టమే?: పాదయాత్ర ఎఫెక్ట్ తగ్గించేలా!, పీకల్లోతు కష్టాల్లో జగన్..
పాదయాత్ర మధ్యలో ఇలా కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం.. రాజకీయంగా జగన్ కు ప్రతికూలాంశమే.
విజయవాడ: వెంటాడుతున్న కేసులు.. వరుసగా ఎదురవుతున్న పరాజయాలు వైసీపీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నంద్యాల ఓటమికి కాకినాడలో బదులు తీర్చుకోవాలని భావించినప్పటికీ.. ఓటర్లు మాత్రం జగన్ పార్టీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో కాకినాడలోను ఓటమి ముందు మోకరిల్లక తప్పలేదు.
తొలుత నంద్యాల ఉపఎన్నికను వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నాందిగా పలికిన జగన్.. ఫలితం తర్వాత మాత్రం మాట మార్చేశారు. దమ్ముంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని, అప్పుడే దాన్ని రెఫరెండంగా పరిగణిస్తామని అన్నారు. ఇదే సీన్ కాకినాడ విషయంలోను మరోసారి రిపీటైంది.

ఎలా స్పందించాలో తెలియని స్థితి:
2019లో జరగనున్న కురుక్షేత్ర సంగ్రామానికి కాకినాడ ఎన్నికలే నాంది అంటూ ప్రచారంలో జగన్ వ్యాఖ్యలు చేశారు. కానీ అక్కడ కూడా పరాజయమే పలకరించడంతో.. ఆ వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇచ్చుకోలేని పరిస్థితి. 16శాతం ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోవడం ఓటర్ల మనోగతాన్ని తెలియజేస్తోంది.

వెంటాడుతున్న కేసులు:
ఓటర్ల నాడి పట్టుకోవడంలో వైసీపీ చాలా వెనుకబడినట్లుగానే కనిపిస్తోంది. దీనికి తోడు కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించేందుకు హైకోర్టు నిరాకరించడం జగన్ ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. దీంతో అక్టోబర్ లో చేపట్టబోయే పాదయాత్ర సమయంలోను ప్రతీ శుక్రవారం ఆయన కోర్టు ముందు హాజరుకాక తప్పదు.

ప్రతికూలమే:
పాదయాత్ర మధ్యలో ఇలా కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం.. రాజకీయంగా జగన్ కు ప్రతికూలాంశమే. ప్రత్యర్థులు ఈ విషయంలో జగన్ ను టార్గెట్ చేసే అవకాశముంది. ఇప్పటికే అవినీతిపరుడు అంటూ జగన్ పై విరుచుకుపడే అధికార పార్టీ నేతలు.. పాదయాత్ర సమయంలో ఆ తీవ్రతను మరింత పెంచకపోరు.

పాదయాత్ర ఎఫెక్ట్ తగ్గించేలా:
పాదయాత్ర ప్రభావాన్ని కనుమరుగుచేసేందుకు.. కోర్టు అంశాన్ని టీడీపీ బాగా ఉపయోగించుకునే అవకాశముంది. దీంతో పాదయాత్ర తన పొలిటికల్ మైలేజీ పెంచుతుందనుకున్న జగన్ ఆలోచనకు కోర్టు కేసుల ఎఫెక్ట్ తప్పేలా లేదు. మొత్తం మీద రానున్న రోజుల్లోను జగన్ కు గడ్డు పరిస్థితులు తప్పేలా లేవన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications