రాయలసీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం: జగన్ ప్రాంతీయ స్వరం
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు అన్యాయం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ స్వరాన్ని ఆయన వినిపించారు. కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం ప్రాజెక్టును ఆయన మంగళవారం సందర్శించారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాలో ఒకే విధంగా చూడకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని జగన్ తప్పు పట్టారు. రాజధాని అభివృద్ధికి తాము అడ్డు కాదని, అభివృద్ధి అన్ని జిల్లాలకు విస్తరించాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు.
హైకోర్టును రాజధానిలో కాకుండా మరో జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాదు చుట్టూతా అభివృద్ధిని కేంద్రీకృతం చేయడం వల్లనే గతంలో ఉద్యమాలు ఊపిరి పోసుకున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మళ్లీ అలా జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించారు.

శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల మేర నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు అందుతాయని, విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం నుంచి కిందికి నీరు విడుదల చేయడంతో రాయలసీమ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని ఆయన అన్నారు.
పద్మావతి మెడికల్ కాలేజీ సీట్లను రాయలసీమ వారికి దక్కకుండా చేశారనే భావన ఉందని ఆయన అన్నారు. కరువు మండలాల ప్రకటన చంద్రబాబు పక్షపాత వైఖరికి నిదర్శనమని, కరువుతో అల్లాడుతూ భాగర్భజలాలు అడుగంటిపోయినా, పులివెందుల నియోజకవర్గంలో ఒక మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారని జగన్ అన్నారు .












Click it and Unblock the Notifications