జగనన్న 'గోరుముద్ద'.. జగనన్న 'కోడిగుడ్డు'!
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో జగనన్న గోరుముద్ద ఒకటి. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందివ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమల్లో సర్కార్ మరో అడుగు ముందుకు వేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం భోజనంలో ఒక గుడ్డు చొప్పున విద్యార్థులకు అందజేస్తున్నారు. అయితే గుడ్లు పాడైపోయినవి పెడుతున్నారని, నాణ్యత ఉండటంలేదని, ఒక్కోసారి మురిగిపోయిన గుడ్లు వస్తున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఇప్పటివరకు 10రోజులకు ఒకసారి వీటిని సరఫరా చేస్తుండగా ఇక నుంచి వారానికోసారి సరఫరా చేయనున్నారు. దీనివల్ల పాడవకుండా ఉంటాయని, నాణ్యతతో ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇక నుంచి ప్రతివారం గుడ్లకు నాలుగు రంగుల స్టాంప్ వేయబోతున్నారు. గుడ్ల సరఫరాలో ఎటువంటి అక్రమాలకు చోటివ్వకూడదనే ఉద్దేశంతో మొదటివారంలో నీలం రంగు, రెండోవారంలో గులాబీ రంగు, మూడోవారంలో ఆకుపచ్చ రంగు, నాలుగోవారంలో వంగపువ్వు రంగుతో కోడిగుడ్లపై స్టాంపింగ్ వేయనున్నారు.

పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలంటే ఉద్దేశంతో వైఎస్ జగన్ సర్కార్ 2020 జనవరి 21వ తేదీన జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం సోమవారం మధ్యాహ్నం అన్నం, గుడ్డు, శనగపిండితో చేసిన వంటకాన్ని వడ్డిస్తారు. మంగళవారం పులిహోర్, టమాటో పప్పు, గుడ్డు, బుధవారం వెజిటబుల్ రైస్, బంగాళదుంప కుర్మా, గుడ్డు, చిక్కు, గురువారం పోలెంట, టమాటోసాస్, గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకు కూర, కోడిగుడ్డు, చిక్కు, శనివారం అన్నం, సాంబారు, పాయసం లేదంటే స్వీట్ పొంగల్ వడ్డిస్తారు.
చిన్నారులకు అందించే భోజనంలో కాంట్రాక్టర్లు ఎవరూ కక్కుర్తిపడి నాణ్యత లేని భోజనాన్ని అందించకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications