చర్చి పాస్టర్లకు జగన్ షాక్- గౌరవ వేతనానికి 16 వేలలో 500 మందే అర్హులు-కీలకంగా సీఎం నిర్ణయం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన హామీల్లో క్రైస్తవుల చర్చిలను నడిపే పాస్టర్లకు గౌరవ వేతనం కూడా ఒకటి. రాష్ట్రంలో వేలాదిగా ఉన్న చర్చిల్లో పనిచేస్తున్న పాస్టర్లలో చాలా మంది నిరుపేదలుగా గుర్తించిన వైసీపీ.. ఆ మేరకు వారికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ఈ జాబితా తయారు చేస్తూనే ఉన్న ప్రభుత్వం ఇప్పుడు వారికి భారీ షాకిచ్చింది.

చర్చి పాస్టర్లకు గౌరవ వేతనం
ఏపీలో చర్చి పాస్టర్ల ఆర్ధిక స్ధితిగతుల్ని దృష్టిలో ఉంచుకుని వారికి నెలవారీ గౌరవ వేతనం ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో ఇచ్చిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేసి తాజాగా కొత్త నిబంధనలు ఇచ్చింది. వీటి ప్రకారం రాష్ట్రంలో చర్చి పాస్టర్లు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు చర్చిల్లో పనిచేస్తున్న దాదాపు 16 వేల మంది పాస్టర్లు గౌరవ వేతనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎంపిక చేశారు. అక్కడే బిగ్ ట్విస్ట్ ఎదురైంది.

16 వేల మందికి 500 మందే ఎంపిక
రాష్ట్రంలో చర్చిలను నడుపుతున్న పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనం కోసం ప్రభుత్వం ఇచ్చిన నిబందనల ప్రకారం సచివాలయాలు ఎంపిక ప్రక్రియను చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 16 వేల దరఖాస్తుల్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాయి. అయితే విచిత్రంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందులో కేవలం 500 మందే అర్హులుగా తేలారు. మిగతా వారంతా అనర్హులుగా తేలారు. దీంతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది. ఈ మేరకు అధికారులు ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

వీరిని అనర్హుల్ని చేసిన నిబంధనలివే
పాస్టర్లను గౌరవ వేతనం కోసం ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మూడు నిబంధనలు పెట్టింది. ఇందులో మొదటికి సదరు చర్చి మినిస్ట్రీస్ రిజిస్టేషన్ పొంది ఉండాలి. అలాగే ఆ చర్చి స్ధలం సదరు సొసైటీ పేరు మీద ఉండాలి. అలాగే గౌరవ వేతనం కోరుతున్న పాస్టర్ కు ఇతరత్రా ఆదాయ మార్గాలేవీ ఉండకూడదు.
ఈ మూడు నిబంధనల్ని పరిశీలించగా.. ఎక్కువ మంది పాస్టర్లు చర్చి స్ధలాలు సొసైటీ పేరు మీద లేకపోవడం వల్ల అనర్హులుగా తేలినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో నవశకం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారి పేర్ల జాబితా సచివాలయాలకు వచ్చే సరికి కొన్ని పేర్లు గల్లంతయ్యాయి. దీంతో ఇప్పుడు ఈ నిబంధనలపై చర్చ జరుగుతోంది.
Recommended Video

పాస్టర్లను జగన్ కరుణిస్తారా?
ఇప్పటికే ప్రభుత్వం పీకల్లోతు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది. చర్చి పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలంటే 16 వేల మందికి నెలకు రూ.5 వేల చొప్పున రూ.8 కోట్ల రూపాయలు నెలకు అవసరం ఉంటుంది. అలాగని 16 వేల మందిలో 500 మందికే ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వ్యతిరేకత తప్పదు. అందరికీ ఇద్దామంటే ఇప్పటికిప్పుడు భారీ మొత్తం పంపిణీకి నిధులు అవసరం.
దీంతో అధికారులు నిబంధనల్లో మార్పులు చేసి కొన్ని వెసులుబాట్లు ఇద్దామని సీఎం జగన్ కు ప్రతిపాదిస్తున్నారు. దీనిపై జగన్ సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అసలే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల్లో ఒక్కో వర్గం వైసీపీకి దూరమవుతోంది. ఈ నేపథ్యంలో పాస్టర్లను దూరం చేసుకునేందుకు జగన్ సిద్దపడతారా లేదా అన్నది త్వరలో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications