ట్రంప్ సరే.. మీ సిండికేట్ సంగతేంటి ? చంద్రబాబుకు జగన్ ట్వీట్..!
అమెరికాలో ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలతో ఏపీలో అక్వారంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. అమెరికా పన్నుల దెబ్బకు భారత్ నుంచి రొయ్యల ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో అక్వా రైతులు స్థానిక మార్కెట్లలో వాటిని అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆక్వా రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా చంద్రబాబు గారూ అంటూ జగన్ ట్వీట్ మొదలుపెట్టారు. అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని నిలదీశారు. రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని అడిగారు. ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి, గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని అడిగారు.

రైతులంతా గగ్గోలు పెడితే, మీడియా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం అన్నారు. 100 కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయిందని, ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
చంద్రబాబుగారూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా ఇలా ప్రతి పంటకూ గిట్టూబాటు ధర లేకుండా పోయిందని జగన్ విమర్శించారు. దళారులు రైతుల కష్టాన్ని దోచుకుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలను ప్రస్తావిస్తే మీ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది తప్ప ఎక్కడా బాధ్యత తీసుకోవడం లేదన్నారు ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతేనన్నారు.
1.@ncbn గారూ.. ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం…
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2025
ఎగుమతుల్లోనూ, అలాగే విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వారంగం దేశంలోనే నంబర్ వన్ అని జగన్ గుర్తుచేశారు. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీని మా హయాంలో ఏర్పాటు చేశామన్నారు. ఆక్వా సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చామన్నారు.
సిండికేట్‌గా మారి దోపిడీచేసే విధానాలకు చెక్ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించమని, కోవిడ్ సమయంలో దాదాపు ఐదేళ్ల క్రితం 100 కౌంట్‌కు, ఆ రోజుల్లో కనీస ధరగా రూ.210లు నిర్ణయించి రైతులకు బాసటగా నిలిచామని గుర్తుచేశారు. మూడుసార్లు ఫీడ్ ధరలు తగ్గించామన్నారు. ఇప్పుడు ఫిష్ ఆయిల్, సోయాబీన్ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15% నుంచి 5% తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్ ధరలు ఒక్కపైసా కూడా తగ్గలేదన్నారు. తాము ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నాసరే రేట్లు తగ్గడంలేదన్నారు.

గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్ పరిధిలో కేవలం 80-90వేల ఎకరాలు ఉంటే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జోన్ పరిధిలోకి 4.22 లక్షల ఎకరాలు తీసుకువచ్చామని జగన్ గుర్తుచేశారు. ఆక్వా రంగంలో మొత్తం 64వేల విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో జోన్ పరిధిలో ఉన్న 54వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందించామన్నారు. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చుచేశామన్నారు.
ఆక్వాజోన్స్‌లో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి, ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపించామని జగన్ తెలిపారు. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేసి, అత్యధికంగా ఆర్జిస్తున్న రంగాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. చంద్రబాబుగారూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి అన్నారు. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి, ధరల పతనాన్ని అడ్డుకోవాలన్నారు. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ టారిఫ్‌లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావని, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయని తెలిపారు. ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదన్నారు.












Click it and Unblock the Notifications