బాబు ఇలాకా నుండి... టిలోను జగన్: 28నుండి టూర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28వ తేదీ నుంచి సమైక్య శంఖారావం చేపట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయిన కుప్పం నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగియనుంది. జగన్ తెలంగాణతో సహా మూడు ప్రాంతాల్లోను తన సమైక్య శంఖారావ యాత్రను చేయనున్నారు.
దీనికి సంబంధించి గురువారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అమర్నాథ్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు. సమైక్యాంధ్ర కోసం జగన్ ఈ యాత్ర చేస్తున్నారని చెప్పారు. 28 తేది నుండి ప్రారంభమవుతుందన్నారు. కుప్పం నుండి శ్రీకాకుళం వరకు మూడు ప్రాంతాల్లో కొనసాగుతుందని చెప్పారు.

ఢిల్లీ అహంకారాన్ని నిలదీస్తూ, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని జగన్ చెబుతున్నారన్నారు. ప్రజలను జగన్ చైతన్యపరుస్తారని, తెలంగాణలో కూడా చాలామంది సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
టిడిపి, కాంగ్రెసు పార్టీలు కలిసి రాష్ట్ర విభజన కోసం కేంద్రానికి గండ్ర గొడ్డలి ఇచ్చారని అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలు పట్టవన్నారు. బాబును చూసి చిత్తూరు జిల్లా ప్రజలు తలదించుకుంటున్నారన్నారు. పార్టీని కాపాడుకునేందుకు రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో ఓదార్పు యాత్ర జరగనందున సమైక్య శంఖారావంలో భాగంగానే ఆ కుటుంబాలని ఓదార్చుతారని చెప్పారు.












Click it and Unblock the Notifications