చంద్రబాబు వద్దకు వస్తే సోమిరెడ్డికి జగన్ పలకరింపు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పలకరించారు. సోమిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు.
సోమిరెడ్డి లోపలకు వెళ్తుండగా ఆయనకు జగన్ తారసపడ్డారు. ఈ సందర్భంగా... నెల్లూరు వాళ్లంతా బాగున్నారా..? మీ కుటుంబం బాగుందా..? అంటూ సోమిరెడ్డిని జగన్ పలకరించారు. అంతా బాగానే ఉన్నారని సోమిరెడ్డి బదులిచ్చారు. కాగా, విలేకరుల సమావేశంలో పలుమార్లు జగన్ పైన సోమిరెడ్డి ఒంటికాలిపై లేచిన విషయం తెలిసిందే.
మరోవైపు మంగళవారం అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు ఏదైనా న్యాయం జరిగిందంటే అది పోలవరమేనని అన్నారు. పోలవరంతో ఏపీకి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కేంద్రం సత్వరమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పోలవరంపై ప్రభుత్వం ప్రవేశపెట్టిని తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు.

అంతకుముందు సభాపతి, జగన్‌ల మధ్య ఆసక్తికర చర్చ కూడా జరిగింది. వివిధ తీర్మానాలను సభ ఆమోదిస్తున్న తరుణంలో... జగన్ లేచి అధ్యక్షా వివిధ తీర్మానాలను ఆమోదిస్తున్నారు... కానీ, అసలు రెజల్యూషన్‌లో ఏముందో తమకు అర్థం కావడం లేదని అన్నారు. దీనికి సమాధానంగా... జగన్ గారు మీరు బీఏసీ సమావేశానికి హాజరై ఉంటే అన్నీ అర్థమై ఉండేవని సభాపతి కోడెల చెప్పారు.
దీంతో, అధ్యక్షా సభలో అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే ఉన్నాయి... మీరు మాత్రం బీఏసీలో ఎక్కువ మంది అధికారపక్ష సభ్యులకు అవకాశమిచ్చి మా సభ్యులకు మాత్రం ఇద్దరికే అవకాశం ఇచ్చారని జగన్ చెప్పారు. దీనికి ముగింపుగా... తీర్మానాల వివరాలను పూర్తి స్థాయిలో సభ్యులకు ఇవ్వాల్సిన అవసరం లేదని... ఇవన్నీ బీఏసీలో చర్చకు వస్తాయని కోడెల అన్నారు.












Click it and Unblock the Notifications