మూడ్రోజుల పాటు జగన్ సోలో మంత్రి-కేబినెట్ రాజీనామాతో- అధికారంలోకి వచ్చాక రెండోసారి
ఏపీలో కేబినెట్ విస్తరణ నేపథ్యంలో నిన్న మంత్రులంతా రాజీనామాలు సమర్పించారు. కేబినెట్ లోని 24 మంత్రులు చేసిన రాజీనామాల్ని సీఎం జగన్ గవర్నర్ కు పంపారు. వాటికి అక్కడ ఆమోదం లాంఛనమే. దీంతో ప్రస్తుతం ఏఫీ కేబినెట్ లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వద్దకు మంత్రుల శాఖలన్నీ వచ్చి చేరబోతున్నాయి. తిరిగి కొత్త కేబినెట్ ఏర్పాటయ్యే వరకూ అన్ని శాఖలకూ ఏకైక మంత్రిగా జగనే ఉండబోతున్నారు.

కేబినెట్ విస్తరణపై సస్పెన్స్
ఏపీలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ముందుగానే మంత్రులకు సూచనలు చేసిన సీఎం జగన్ కేబినెట్ భేటీ తర్వాత వారితో రాజీనామాలు చేయించేశారు. మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న వారిలో ఐదారుగురిని కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ వారితో కూడా రాజీనామాలు చేయించారు. తద్వారా కేబినెట్ విస్తరణపై రెండు రోజుల పాటు సస్పెన్స్ కు జగన్ తెరదీశారు. ఇప్పటికే కొత్త మంత్రుల పేర్లు అన్ని మీడియాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సోలో మంత్రిగా మారిన జగన్
ఏపీలో మొత్తం మంత్రులు అంతా నిన్న తమ రాజీనామాలు సమర్పించారు. అంటే మంత్రి అన్న వారు ఇపుడు ఏపీ సర్కార్ లో ఎవరూ లేరన్న మాట. ఇక మిగిలింది ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే. కొత్త మంత్రివర్గం ఈ నెల 11వ తేదీ ప్రమాణస్వీకారం చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. దీంతో అప్పటి వరకూ జగన్ మిగతా మంత్రుల శాఖలన్నింటినీ తన వద్దే ఉంచుకుంటారు. ఈ మేరకు అధికారిక ఆదేశాలు కూడా ఇస్తున్నారు. మంత్రుల రాజీనామాలతో సోలో మంత్రిగా మారిన జగన్.. కొత్త మంత్రివర్గం ఏర్పాటయ్యే వరకూ అంటే మూడు రోజుల పాటు అన్ని శాఖలకు ఏకైక మంత్రిగా వ్యవహరిస్తారు.

సోలో మంత్రిగా జగన్ రెండోసారి
కేబినెట్ మంత్రుల రాజీనామాలతో జగన్ సోలో మంత్రిగా అన్ని శాఖల వ్యవహారాలకు బాధ్యుడిు కానున్నారు. అంటే ఆయనే రాజు ఆయనే మంత్రి అన్న మాట. నిజానికి ఈ రకమైన పరిస్థితి గతంలో ఉందా అంటే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు ఓసారి ఇలాగే జరిగింది. 2019 మే 30న జగన్ ఒక్కరే సీఎం గా ప్రమాణం చేశారు. ఆ తరువాత జూన్ 8న కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. అంటే నాడు తొమ్మిది రోజుల పాటు జగన్ ఒక్కరే ఏపీని పాలించారు.
దాంతో ఈసారి నాలుగు రోజులు సైతం జగనే టోటల్ క్యాబినేట్ గా ఉంటారన్న మాట. ఈ మధ్యలో ఆయన కొత్త మంత్రులను ఎంపిక చేసుకుని ఆ జాబితాను గవర్నర్ కి పంపడం 11న ఉదయం ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. కొత్త మంత్రులు వచ్చి పాలనా పగ్గాలు పుచ్చుకునే దాకా జగన్ ఒక్కడే ఏపీకి పరిపాలకుడు కానున్నారు.












Click it and Unblock the Notifications