ఎన్నికల వేళ అసంతృప్తి పై జగన్ కొత్త ఎత్తుగడ..!!
ఏపీలో ఎన్నికల పోరులో అసలైన అంకం మొదలైంది. వైసీపీ మేనిఫెస్టో ప్రకటించింది. కొత్త హామీల ప్రస్తావన లేకుండా జగన్ తన మేనిఫెస్టో ప్రకటించారు. గత అయిదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అమ్మఒడి, రైతు భరోసా కొంత మేర పెంచాలని నిర్ణయించారు. పెన్షన్ రూ 500 మేర పెంచుతామని చెప్పారు. ఈ రోజు నుంచి జగన్ సుడిగాలి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. మేనిఫెస్టో నిర్ణయాలను ప్రధానంగా ప్రచారం చేయనున్నారు.
జగన్ ఎన్నికల ప్రచారం
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తాడిపత్రి లో వైయస్ఆర్ సర్కిల్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరి లో త్రిభువని సర్కిల్ లో జరిగే సభ లో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ని కందుకూరులో కె ఎం సి సర్కిల్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. ఈ ప్రచార సభల్లో ప్రధానంగా తాజాగా తాను ప్రకటించిన మేనిఫెస్టో పైన ప్రస్తావించనున్నారు. కూటమిని టార్గెట్ చేయనున్నారు.

మేనిఫెస్టో అంశాల పై
జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలక హామీలు ఉంటాయని అభ్యర్దులు, పార్టీ నేతలు అంచనా వేసారు. కానీ., జగన్ వాటికి భిన్నంగా మేనిఫెస్టో ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల పరిధినే కొంత మేర పెంచారు. అమ్మఒడి రెండు వేలు, రైతు భరోసా రూ 2500, పెన్షన్ రూ 500 వరకు మాత్రమే పెంచుతూ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. చేయగలిగిందే తాను చెబుతానని..చెప్పింది చేస్తానని జగన్ పేర్కొన్నారు. తాను అమలు చేస్తున్న పథకాల ఖర్చు 70 వేల కోట్లుగా వెల్లడించారు. చంద్రబాబు ఇప్పటికే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల విలువ లక్షా 50 వేల కోట్లుగా లెక్కలతో వివరించారు. సాధ్యం కాని హామీలు తాను ఇవ్వనని జగన్ స్పష్టం చేసారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.

జగన్ కొత్త వ్యూహం
జగన్ కంటే అమ్మఒడి, పెన్షన్, రైతు భరోసా విషయాల్లో చంద్రబాబు ఎక్కువ మొత్తం ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా..జగన్ మాత్రం ఆ స్థాయిలో పెంచుతానని హామీ ఇవ్వలేదు. ఈ పరిణామం కూటమికి అనుకూలంగా మారుతుందా అనే చర్చ ఉంది. అయితే, జగన్ గెలుపు పైన ధీమాతోనే తన పథకాలను కొనసాగిస్తూ...బడ్జెట్ లెక్కలను వివరిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. మేనిఫెస్టో పైన కొన్ని వర్గాల్లో
అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. దీంతో..ఈ ఎన్నికల ప్రచార సభల్లో తన మేనిఫెస్టోతో పాటుగా హామీల అమలులో తన ఆలోచన..కూటమి లెక్కల గురించి జగన్ వివరించనున్నారు. దీంతో..ఇప్పుడు జగన్ ఇచ్చే వివరణ..కూటమి ప్రకటించే మేనిఫెస్టో ఓటింగ్ లో ఎవరికి అనుకూలంగా మారుతుందనే ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications