జగన్..ఇంకా బీజేపీని నమ్ముకుని కూర్చుంటారా?
YS Jagan Mohan Reddy: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. మొత్తం 16 రోజుల పాటు లోక్‌సభ, రాజ్యసభ సమావేశమౌతాయి. 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఎల్లుండి ఆల్ పార్టీ..
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించబోతోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందు అంటే 21వ తేదీన ఈ భేటీ ఏర్పాటైంది. అన్ని పార్టీల సభా పక్ష నాయకులు దీనికి హాజరు కావాల్సి ఉంటుంది. ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఉభయ సభల కార్యకలాపాలను సజావుగా కొనసాగేలా చూడాలని కేంద్రం.. విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అలాగే- సభలో ప్రవేశపెట్టబోయే కొన్ని కీలక బిల్లులపైనా చర్చించవచ్చు.

రేపు పార్లమెంటరీ పార్టీ..
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలుపునిచ్చారు. శనివారం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేస్తారు.
వ్యూహాలకు పదును
తెలుగుదేశం పార్టీ- జనసేన.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో- తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఎదురైంది. గతంలో ఎప్పుడు కూడా మోదీ సర్కార్‌తో ఘర్షణ వైఖరికి దిగలేదు వైసీపీ. బీజేపీపైనా ఘాటు విమర్శలకు దిగిన సందర్భాలు లేవు. మోదీతో సత్సంబంధాలు కొనసాగించారు జగన్.
ప్రత్యర్థిగానే
ఇప్పుడా పరిస్థితి లేదు. టీడీపీ- జనసేనతో పాటే బీజేపీని కూడా ప్రత్యర్థి పార్టీగానే భావించాల్సి రావడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ నలుగురు సభ్యల బలం మాత్రమే ఉంది. రాజ్యసభలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. 11 మంది సభ్యులు ఉన్నారా పార్టీకి. ఇక్కడ కూడా ఎన్డీఏకు పూర్తి బలం లేదు. కీలక బిల్లుల విషయంలో వైసీపీ వంటి తటస్థ పార్టీల మద్దతు తప్పనిసరి.
మద్దతా? పోరుబాటా?
గతంలో అన్ని కీలక బిల్లుల విషయంలో ఎన్డీఏకు అండగా నిలిచినప్పటికీ- తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం, ఏపీలో ఆ పార్టీ విజయం సాధించడానికి బీజేపీ పెద్దలు తమవంతు కృషి చేయడం, ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీపై రాజకీయంగా దాడికి జగన్‌కు మింగుడుపడని విషయమే.
ఇంకా నమ్ముకుంటే..?
ఈ పరిస్థితుల్లో బీజేపీపై పోరుబాటే లక్ష్యంగా దిగాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో ఉన్న తమ బలాన్ని ఉపయోగించుకుని బిల్లుల విషయంలో ఎన్డీఏకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications