అసెంబ్లీ వేళ.. జగన్ కీలక భేటీ- ఆ దిశగా
YS Jagan: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రంలో రైతులు నిరసనలు చేపట్టడం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానం.. వంటి ప్రస్తుత పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ఉద్యమ కార్యాచరణకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు. జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. క్యాడర్‌లో ఊపు తెచ్చే నిర్ణయాలను తీసుకుంటోన్నారు.

ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం వంటి అంశాలను మరింత ఉధృతంగా జనంలోకి తీసుకెళ్లాలంటూ సూచించారు అప్పట్లో. ఇక తాజగా నేడు మరోసారి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. తాడేపల్లిలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం, అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు, శాంతిభద్రతలు, పార్టీ కార్యకర్తలపై దాడులు- అరెస్టులు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications